నేటి నగర జీవనంలో ఎక్కువ మందికి వసతి కల్పిస్తున్నవి అపార్టుమెంటులే అనేది వాస్తవం. సొంత ఇంటి కలను నిజం చేసుకోవటానికి ప్రతి కుటుంబం తాపత్రయ పడుతుంది.
శుభాశుభ కార్యక్రమాలు స్వగృహంలోనే జరుపుకోవాలనేది సర్వదా వ్యాప్తి చెందిన సూత్రం. అద్దె ఇంటి అగచాట్లు, నిలకడ లేని చిరునామా, అందంగా, పొందికగా సొంతఇల్లు ఉండాలనే కోరికలు, అభిరుచులు, తిన్నా తినక పోయినా గుట్టుగా తలదాచుకునే ఒక గూడు సమకుర్చుకోవాలనే తపన ... వెరిసి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి వ్యక్తి మదిలో ఏదో ఒక సమయాన ఉదయిస్తుంది.
పెళ్లి అయిన ప్రతివారు తమకంటూ ఒక ఇల్లు కావలనుకొంటారు. స్థలం తీసుకొని తనకు నచ్చినట్లు నాణ్యతగా ఇల్లు కట్టుకోవాలంటే ఈనాడు కుదిరే విషయం కాదు. అందుకే మనవారు 'ఇల్లు కట్టి చూడు , పెళ్లి చేసి చూడు' అని అన్నారు. ఈ నానుడి నేటి పరిస్థితులలో కొద్దిగా మార్చుకోవాలి,
'ఇల్లుకొని చూడు-పెళ్లిచేసి చూడు' అని అంటే వాస్తవానికి అతికినట్లు సరిపోతుంది.
అనేక మంది ముఖ్యంగా మధ్య తరగతి వారు, ఉద్యోగులు తమ జీవితకాలం కష్టించి పైసా పైసా కూడబెట్టిన సొమ్ముకు బ్యాంకు అప్పు జోడించి తమ ఆర్దికశక్తి తగ్గ అపార్టుమెంటును కొంటున్నారు.
కాని ఈ కొనుగోలు చేసిన అపార్టుమెంటు మన్నికైనదేనా దాని యొక్క జీవిత కాలం ఎంత? అనే విషయం పెద్దగా గమనిస్తున్నట్లు లేదు. అపార్టుమెంటు పై పై మెరుగులు చూసి మోసపోతున్నారు.
పడక గదులు ఏ దిక్కులో ఉన్నాయి, వంట గది వాస్తు ఎలా ఉంది, ప్రధాన ద్వారం ఏ దిశకు ఉంది, ఫ్లోరింగ్ కు ఏమి వాడారు, రకరకాల రంగులు తో మెరుగులు అద్దిరా లేదా? వంటి సదా సీదా విషయాలకు ఇచ్చినంత ప్రాధాన్యం దాని నిర్మాణం ఎలా చేసారు, నాణ్యమైన వస్తువులు ఉపయోగించారా, సాంకేతిక సలహాలను పాటించారా లేదా, బిల్డర్ ఎలాంటి వాడు? అనే విషయాలకు ఏమాత్రం విలువ ఇవ్వకపోవటం శోచనీయం.
ధర తగ్గించి, తాయిలాలు ఎర వేసి, వాస్తు వాసన చూపి, పగుళ్ళకు లప్పం పూసి, నాసి రకం కలపకు మక్కు పెట్టి ముస్తాబు చేసిన 'బంగారు లేడి'ని మనకు అంటగట్టే మారిచక ప్రభుద్దులు బిల్డర్ అవతారం లో ఉంటారని తెలుసుకోండి.
అపార్ట్ మెంట్ బలం
'వాస్తులో' లేదని, దానికి వాడిన 'వస్తువుల బలం' లోనే ఉందన్న సంగతిని గమనిచండి.
అపార్టుమెంట్ల ఆయుర్దాయం ఎంత?
మనిషికి ఆయుర్దాయం నూరు ఏళ్ళు అయితే సాంకేతిక నిపుణుల పరివేక్షణలో, ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటిస్తూ నాణ్యమైన వస్తువులతో , సాంకేతిక విలువలను పాటిస్తూ నిర్మించిన అపార్టుమెంట్ అయితే అది దాదాపు 60 నుండి 70 ఏళ్ళు మనుగడ సాదిస్తుంది.
'మేస్త్రులు మేడలు కడితే కుక్కతోక తగిలి కులిందట' అనే నానుడి నిజం చేసే పరిస్థితులు కన్పిస్తున్నాయి. నాసిరకం వస్తువులతో లాభాపేక్షతో కట్టిన అపార్ట్ మెంట్ అయితే 10 ఏళ్ళకే మరమ్మతులు కొరకు ఎదురు చూస్తుంది. గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదన్నట్లు కొన్నాళ్ళకు వీటిపై వచ్చే అద్దె కంటే వాటి మరమ్మతు లకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇలాంటి అపార్ట్ మెంట్లు 30 ఏళ్ళు మనుగడ సాధించటమే గొప్ప. తుపానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులకు ఇలాంటి భవనాలు ఏమాత్రం తట్టుకోలేవు.
తేమ ప్రదేశాలలో కాని సముద్ర తీరప్రాంతలలో గాని కట్టినవి అయితే కాంక్రీటులో ఉన్న స్టీలు తుప్పు తిని 20 ఏళ్లకే పెచ్చులు ఊడి కూలటానికి సిద్దంగా ఉంటాయి. సరైన నీటి పైపులు వేయకపోవడం, బాత్రూమ్ లో నీరు లీకు అవటం తద్వారా గోడల్లో తేమ చేరటం వల్ల కూడా అపార్టుమెంటు ఆయుష్షు తగ్గుతుంది.
ఇలాంటి నాణ్యత లేని అపార్ట్ మెంట్లు కొనుక్కొని దానికి తరచూ మరమ్మతులకు చేసుకుంటూ, 'ఎరక్కపోయి ఇరుక్కున్ననే' అని నానా అవస్థలు పడుతూ ఉంటారు.
ఇంటి పై చేసిన 'అప్పు' తిర్చేసరికి అపార్టుమెంటు ఆయుస్సు తీరి అంతిమ యాత్రకు (శిధిలావస్థకి) సిద్దంగా ఉంటుంది. చివరికి చేతికి 'చిప్ప' మిగులుతుంది. తస్మా జాగ్రత్త !
అపార్టుమెంటు కొనేముందు దాని వాస్తు, సౌకర్యం, సౌందర్యలతో పాటు దాని నిర్మాణానికి సంబందించిన విషయాలలో నాణ్యతకు, దృడత్వానికి చెందిన అన్ని విషయాలు నిశితంగా గమనించండి. లేకుంటే తరువాత వగచినా ప్రయోజనం శూన్యం. అపార్టుమెంట్ కొనుగోలు చేసేముందు రేరా చట్టం గురించి అవగాహన చేసుకోవాలి. ఈ చట్ట పరిధిలో నమోదు చేసుకొన్న ప్రాజెక్టులలో మాత్రమే కొనుగోలు చేస్తే మీ డబ్బుకు భద్రత మరియు మీ ఇంటికి రక్షణ కలుగుతాయి.
నిర్మాణాలలో నిబంధనలు పట్టవా?
బహుళ అంతస్థుల భవన నిర్మాణాల విషయంలో ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేసాయి. 15 మీటర్లు (50 అడుగులు) ఎత్తుకు పైబడిన భవనాలు ఈ చట్ట పరిధిలో ఉంటాయి.
1. మునిసిపల్ బైలా డెవలప్ మెంట్ కంట్రోల్ రెగ్యులేషన్
2. జాతీయ భవనాల చట్టం NBC -1983
3. A.P అగ్నిమాపక చట్టం -1999
ఈ చట్టాలలో చెప్పిన నిబంధనల ప్రకారం కనీసం 50 వేల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకులు భవనం కింది భాగంలోనూ, పైనా నిర్మించాలి. భవనం చుట్టూ 6 మీటర్ల కాళీ ప్రదేశం ఉండాలి. అగ్ని ప్రమాదాలను ముందుగా తెలియజేసే అలారం ఏర్పాటు చేయాలి. నాణ్యమైన విద్యుతు తీగలను, మెటల్ కండక్టర్లు, పరికరాలు వాడాలి.
4. రేరా చట్టం RERA - ACT
The Real Estate (Regulation and Development) Act, 2016
స్థిరాస్తి రంగంలో పారదర్శికత మరియు నియంత్రణ కొరకు ఏర్పరిచిన రేరా చట్టం నేడు అమలులో ఉంది.ఈ రేరా చట్టం ప్రకారం కొనుగోలు దారునికి అనేక హక్కులు లభించాయి.
ఎనిమిది కంటే ఎక్కువ లేక 500 చదరపు మీటర్లు కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు తప్పనిసరిగా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.
కొనుగోలుదారుని నుండి వసూలు చేసిన డబ్బులో 70 శాతం బ్యాంకు అకౌంట్లో ఉంచి ప్రతి రూపాయకు లెక్కా జమ ఉండాలి.
ప్రాజెక్టుకు సంబందించిన ప్రతి ఒక్క అంశం అధికారిక వెబ్సైటు లో ఉంచాలి.
అపార్టుమెంటు లో కార్పెట్ ఏరియా (గోడల లోపల ఉన్నస్థల విస్తీర్ణం) బట్టి ధర ఉండాలి. సూపర్ బిల్ట్ ఏరియా అంటూ అందరికి ఉపయోగపడే కారిడార్లు, లిప్ట్ , మెట్లు ,బాల్కనీ,లాబీ ల విస్తీర్ణం కలిపితే వచ్చే విస్తీర్ణం బట్టి డబ్బు అడగరాదు.
అనుకొన్న సమయానికి నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారునికి ఇవ్వలేని పక్షంలో వారు చెల్లించిన డబ్బుకు బ్యాంకు వడ్డీ పై అదనంగా 2 శాతం కలిపి బిల్డర్ చెల్లించాలి.
కొనుగోలుదారు అపార్టుమెంటు స్వాధీనం చేసుకొన్న తరువాత 5 సంవత్సరాలు లోపు వచ్చే అన్ని మరమత్తులు బిల్డరే చేయాలి.
స్థలం హక్కు పత్రం (టైటిల్ డీడ్) లో ఏవైనా అవతవకలు ఉంటె నష్ట పరిహారం పొందే హక్కు కొనుగోలుదారునికి ఉంది.
కొనుగోలుదారు తో వచ్చే వివాదాలను 120 రోజులలో బిల్డర్ పరిష్కరించుకోవాలి.
ఆచార్య కొడాలి శ్రీనివాస్
Comments