Skip to main content

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి. 

నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది. 

చరిత్ర 

కీ.శ. 1565లో తళ్ళికోట యుద్ధంలో బహమనీ సుల్తానుల చేతిలో  విజయనగర పాలకుడు అలయ రామరాయలు ఓటమితో దక్షణ భారతదేశంలో పెనుమార్పులు వచ్చాయి. 1579 నాటికి  కొండవీడు, కొండపల్లి. ఆదోని, ఉదయగిరి దుర్గాలు అన్ని గోలుకొండ కుతుబ్ షాల పాలన కిందకు వచ్చాయి. ఆ తరువాత  300 ఏళ్ళు అవిచ్చిన్నంగా వర్థిల్లిన కమ్మ వారి గండికోట రాజ్యం  1652 ADలో జరిగిన  గండికోట యుద్ధంలో పతనం అయింది. పెమ్మసాని తిమ్మనాయకుని  పతనానంతరం గండికోట రాజ్యం కూడా  గోలుకొండ  కుతుబ్ షాల పాలనలోకి వచ్చింది. విజయనగర పతనం నుండి గండికోట పతనం వరకు దాదాపు ఒక శతాబ్దం పాటు (1564-1652AD) రాజ్య రక్షణ కొరకు ధీరోదాత్తంగా అలుపెరుగని పోరాటాలు చేసి ఎందరో కమ్మ వీరులు వీర స్వర్గం పొందారు. మిగిలిన యోధులలో కొంతమంది తంజావూరు నాయక ప్రభువుల వద్దకు పోగా మిగిలిన సామంత, దండ నాయకులు గోలుకొండ  కుతుబ్ షాల పరిపాలనలో జమిందారులుగా, రెవిన్యూ వసూలు చేసే మండల గ్రామాధికారులుగా స్థిర పడిపోయారు. 

ఇదే సమయంలో ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబుతో కుదిరిన శాంతి ఒప్పందంలో భాగంగా మరాఠా మహారాజు ఛత్రపతి శివాజీ 1665లో మొదటసారి చౌత్ (నాలుగోవంతు పన్ను) ప్రవేశపెట్టి దక్కన్ సుల్తానులు అయినా బీజాపూర్, గోలుకొండ వారి నుండి సుంకం వసూలు చేశారు. ఆ తరువాత శివాజీ మహారాజ్ మనుమడు సాహు భోస్లే కు 1719లో ఆరు దక్కన్ రాజ్యాలనుండి ఈ చౌత్ వసూలు చేసుకొనే హక్కు మొగలాయి చక్రవర్తి నుండి దాఖలా పడింది. మొగలాయి రాజ్య రక్షణ కొరకు  15000 మంది సైనిక పటాలాలను సంరక్షించటానికి ఈ సొమ్ము వినియోగించేవారు. ప్రజల నుండి చౌత్ వసూలు చేసే రాజ్యోద్యోగి ని చౌదరి అని పిలిచేవారు. చౌత్ వసూలు చేసే ప్రాంతమైన గోలుకొండ  కుతుబ్ షాల పరిపాలనలో కమ్మవారు జమిందారులుగా, రెవిన్యూ వసూలు చేసే గ్రామాధికారులుగా పనిచేసినట్లు ఇంతకు ముందే చెప్పుకున్నాం. అప్పుడే చౌదరి అనే పేరు కమ్మవారికి సంక్రమించినట్లు భావించవచ్చు. 17వ శతాబ్దం ప్రారంభం నుండి కమ్మవారిలో చౌదరి పేరు వారసత్వంగా కొనసాగుతూ ఉండటం గమనించవచ్చు.

ప్రజల నుండి ఈ పన్నులు వసూలు చేసి రాజుగారి ఖజానాకు జమచేసే ముకద్దమ్, చౌదరీ లగా పిలవబడే గ్రామ పెద్దలే కాలక్రమంలో జమిందారులుగా మారారని ప్రముఖ చారిత్రిక పరిశోధకుడు డా.కోశాంబి గారు అభిప్రాయపడ్డారు. 

ఈ నేపధ్యంలో పలిశీలించితే 'చౌదరి' అనే పదం మొదట పన్ను వసూలు చేసే రాజోద్యోగ చిహ్నంగా మొదలై గౌరవ నామంగా  మారి నేడది తెలుగునాట కమ్మ కుల సంకేతంగా మిగిలినట్లు తేటతెల్లం అవుతోంది. ఉత్తర భారత దేశంలో చౌదరి అనే పేరు రాజపుత్రులు, జాట్లు, కుర్మీలు వంటి కులాలలో కనపడుతుంది. పశ్చిమ బెంగాలి బ్రాహ్మణులలో కూడా చౌదురి పేరుతో ఒక శాఖ కనిపిస్తుంది. ఉత్తర భారతదేశంలో మొగలాయల పరిపాలనలో ముస్లిం సైన్యాధికారులు, మిరాశీదారులు  కూడా చౌదరి బిరుదు ధరించారు. ఉర్దూ భాషలో చౌదరి అంటే రింగ్ లీడర్,  విశ్వాసపాత్రుడు అని అర్ధం.

అర్ద వైరుధ్యాలు  

ప్రముఖ కవి, పరిశోధకులు కీ. శే. యార్లగడ్డ బాల గంగాధరరావు గారు ఒక వ్యాసంలో (కమ్మవైభవం-నవంబర్ 2005)  నాలుగు ప్రధాన దిశలలో నాలుగు ద్వారాలు ఉన్న గృహాన్ని 'చౌత్ ద్వార్' అని అంటారని, ఇలాంటి ఇంటిలో నివసించే గృహ యజమానిని చౌదరి అని పిలిచేవారని అభిప్రాయపడ్డారు. ఇది సత్యదూరమని చెపుతూ నేను రాసిన వివరణలో (కమ్మవైభవం-జనవరి 2006) చెప్పిన విషయాలను ఇక్కడ ఉదాహరిస్తాను. 

నాలుగు దిశలలో నాలుగు శాలలు ఉండి నాలుగు ప్రధాన దిశలకూ ద్వారాలు ఉన్న గృహాన్ని వాస్తు శాస్త్రంలో 'చతుశ్శాలా గృహం' గా చెప్పబడినది. ఈ చతుశ్శాలా గృహాన్ని మన తెలుగునాట 'మండువా లోగిలి' గా పిలుస్తారు. దీనిలో నాలుగు వైపులా శాలలు ఉండి మధ్యలో ఖాళీ ప్రదేశంతో ఉండి కానీ లేకుండా కానీ నిర్మిస్తారు. దీనిని అంగణం అని, వెలుపల చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ప్రాంగణం అని అంటారు. అయితే రక్షణ కొరకు రాజవీధి నుండి ప్రధాన ప్రవేశ ద్వారం (సింహ ద్వారం) ఒక్కటే ఉంటుంది.  నాలుగు దిశలలో ప్రవేశ ద్వారాలను సాధారణ నివాస గృహాలకు ఏర్పరచరు. నాలుగు వీధుల మధ్య ఉన్న ప్రదేశాన్ని 'బ్రహ్మ ప్రదేశం' అని అంటారు. ఈ ప్రదేశంలో దేవాలయం కానీ, బొడ్డు రాయి (నాభి శిల) కానీ ఉంటుంది. నాలుగు రోడ్ల కూడలిని చౌరస్తా అంటారు. ఇలాంటి మధ్య ప్రదేశంలో చతుశ్శాలా గృహం కానీ మరి ఏ ఇతర నివాస గృహాలను కానీ నిర్మించుకోవటం నిషిద్ధం.   

అలాగే 'బారాదరీ' అనే మరొక పదంతో చౌదరీ కి సామ్యం ఉన్నట్లు భావించరాదు. బారా  అంటే 12 , దారీ  అంటే ద్వారాలు వెరిసి 'బారాదారీ' అంటే 12 ద్వారాలతో ఉన్న కట్టడం. మొఘలాయుల కాలంలో  గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా నాలుగు ప్రధాన దిశల్లో ప్రతి దిశ లోను మూడు ద్వారాలతో మొత్తం 12 ద్వారాలతో నిర్మించే వినోదశాలను బారాదారీ అనేవారు. సంగీత, నాట్య ప్రదర్శనల కొరకు ఈ  వినోదశాలను (మండపం) ఉపయోగించేవారు. చతుశ్శాలా గృహాలను చౌత్- ద్వార్ (చౌదరీ) అనే పేరుతోకాక వీటిని  'చౌశాల' అనే పేరుతోనే ఉత్తర భారత దేశంలో పిలుస్తారు.  ఒకవేళ చతుశ్శాలా ను చౌదరీ గా భావించినా ఇది ఒక రకమైన ఇంటిని మాత్రమే సూచించాలి. ఎందుకంటే పూర్వం నుండి ఈ చతుశ్శాలా గృహాలను అన్ని కులాల వారు నిర్మించుకున్నారు. పురాణాల్లో, కావ్యాలలో ఈ రకమైన ఇళ్ల గురించిన వర్ణనలు చాలా ఉన్నాయి. మహాభారతంలో పాండవులను మట్టుపెట్టటానికి దుర్యోధనాదులు ప్రోద్బలంతో పులోచనుడు నిర్మించిన లక్క ఇల్లు చతుశ్శాలా గృహం. దీనికి రాకపోకలకు ఒకే ద్వారం ఉంది. అలాగే మాంసం అమ్మి జీవించే ధర్మవ్యాధుని నివాస గృహం కూడా చతుశ్శాలే. మృచ్ఛకటికం లో  చారుదత్తుని గృహం చతుశ్శాలా గృహమే. అలాగే గ్రామ, నగర, పట్టణాలలో పనిచేసే రాజ్యోద్యోగులందరు నివసించిన గృహాలన్నీ చతుశ్శాలలే. వీరితోపాటు సంపన్నులు, వ్యాపారులు కూడా వీటిలొనే నివశించేవారు. వీరెవరని చౌదరీలుగా పిలవబడలేదు. కాబట్టి చౌదరి పదం చౌత్ ద్వార్ నుండి  ఉత్పన్నం కాలేదన్నది సుస్పష్టం.      

చౌదరి అంటే ఒక పరగణాకు గాని  లేక ఒక గ్రామానికి గాని పెత్తనకారుడిగా ఉండే 'కాపు' అని శబ్దరత్నాకరం కూడా చెబుతున్నది. వ్యవసాయం చేసే వారిని కాపులు అని అంటారు. కాపు అంటే ఒకనాడు వ్యవసాయ వృత్తి నామమే కాని ఒక కులనామం కాదు. రాయాలసీమ ప్రాంతంలో వ్యవసాయ వృత్తిలో ఉన్న 'రెడ్డి' కులస్థులుగా నేడు పిలవబడుతున్న పూర్వం వారిని కాపు కులం వారిగానే పిలవబడ్డారు. గోదావరి తీర ప్రాంతంలో వ్యవసాయ వృత్తిలో ఉన్న వారిని 'కాపులు' అనే నేటికీ అంటారు, వ్యవసాయం చేసే కమ్మవారిని కొన్ని చోట్ల కాపులగానే సంభోదించేవారు. గ్రామాలలో పెత్తనం చేసే వాడిని 'పెద్దకాపు' అని అంటారన్న విషయం తెలిసిందే. అలాగే సీమ ప్రాంతంలో పెత్తనం చేసే వాడిని 'రెడ్డి' అని అంటారు. తీర్పు చెప్పే పెదకాపు రచ్చబండపై కూర్చునే పద్దతిని రెడ్డిగం అంటారు. గత కొంతకాలంగా రాయలసీమ కాపులు రెడ్లగాను, గోదావరి తీర కాపులు 'కాపులు'గాను పిలవబడుతున్నారు. కానీ కమ్మ కాపులు మాత్రం కమ్మ కులం అనే పేరుతో ప్రసిద్ధి చెందారు కానీ చౌదరి కులంగా చెప్పబడలేదు. అలాగే కమ్మవారు అందరు తమ పేరులో చౌదరి అని మకుటం ధరించలేదు. కానీ చౌదరి పేరు ఉన్న వారందరు కమ్మవారై ఉండటం గమనించవచ్చు.  ఇది బహుశా కృష్ణా, గోదావరి తీరప్రాంతాలలో చౌదరి తనం చేసిన వారిలో ఎక్కువమంది కమ్మవారు అయినందువల్ల చౌదరి అంటే కమ్మవారు అనే నానుడి వచ్చింది, మిగతా కులాలు వారు చౌదరి తనం చేసినా అది వారికి ఉద్యోగంగానే మాత్రమే మిగిలింది.

మన్సుబుదారు - కరణికం 

క్రీ.శ. 1579 లో గోలుకొండ కుతుబ్ షా మద్దత్తుగా మరాఠీ సైనిక పటాలం రాయా రావు నాయకత్వంలో  కొండవీటి దుర్గాన్ని స్వాధీనం చేసుకుంది. ఇతడు తొలిసారిగా వినుకొండ, బెల్లంకొండ దుర్గాలను స్వాధీనం చేసుకొన్నాడు. తదుపరి నాగార్జున కొండ, మాచెర్ల, గురజాల, తంగెడ, మాచవరం, అడ్డంకి, అమ్మనబ్రోలు ప్రాంతాలను స్వాధీనం చేసుకొని కొండవీడును జయించాడు. అంతకు మునుపు 1531 లో ఒకసారి 1537 లో మరోసారి కుతుబ్ షాల నుండి చేజారిన కొండవీడు కోట ఈ దండయాత్రలో తిరిగి వారికి దక్కి ముర్తజానగర్ గా మారింది. 

ఈ విజయంలో కీలక పాత్ర నిర్వహించిన మరాఠి బ్రాహ్మణ కులస్తుడైన  రాయారావు నే కొండవీటి  ముకద్దమ్ దారుగా (పాలకుడిగా) కుతుబ్ షా నియమించారు. ముకద్దమ్ రాయరావు   ఆనాటి కొండవీటి పరగణాను 14 సముతులుగా విభజించారు. 

1. పాలడుగు 2. ప్రత్తిపాడు 3. నూతక్కి 4, పొన్నూరు 5. మునుగోడు 6. రావిపాడు 7. గుంటూరు 8. పులివర్రు 9. సంత రావూరు 10. చేబ్రోలు 11. మంగళగిరి 12. నాదెండ్ల 13. కూచిపూడి 14. తాడికొండ.   ఈ సమితులలో ఆనాడు 495 గ్రామాలు ఉండేవి.  ఇలాగే కుతుబ్ షాల పాలనలో ఉన్న 66 దుర్గాలను వాటి పాలనాప్రాంతాలను  పరగణాలుగా, సముతులుగా విభజింప బడ్డాయి. వీటిలో ఎక్కువ దుర్గాలకు  కమ్మ, వెలమ, రాజు, రెడ్డి నాయకులను పాలకులుగా నియమించారు. 

ఈ సమితుల  పరిపాలకులుగా, ముఖ్యంగా చౌత్ (శిస్తు) వసూలు చేసే  చౌదరీ లు (తాసిల్దార్) అధికారులుగా నియమించబడ్డారు. వీరికి గ్రామాలలో సహాయం కొరకు మన్సుబులను, కరణాలను నియమించారు. మసుబులుగా స్థానిక గ్రామ పెత్తందారులను, కరణాలుగా మహారాష్ట్ర నుండి తీసుకొని వచ్చిన  బ్రాహ్మణులను నియమించారు. తెలుగునాట బ్రాహ్మణులలో 6వేల  నియోగుల పేరుతో ఈనాటికి ఒక ప్రత్యేక శాఖగా కొనసాగుతూ ఉండటం గమనించవచ్చు. 

ఆతరువాత  గోలుకొండ లో కుతుబ్ షాల పాలన 1687 లో అంతమై ఔరంగజేబు పాలనలో మొఘలాయుల కిందకు, 1724లో అసఫ్ జహిల (నిజాం) పాలన వచ్చింది.  వీరి పాలన కూడా కుతుబ్ షాహిల పాలనను చిన్న చిన్న మార్పులతో కొనసాగించారు. వీరి కాలంలో 25 శాతం పన్ను(చౌత్) కు అదనంగా మరో 10 శాతం పన్నుసర్ దేశ్ ముఖ్ పేరుతో  వసూలు చేసారు. ఈ పన్ను వసూలు చేసే వారిని దేశ్ ముఖ్ లని, దేశ్ పాండే లని పిలిచేవారు. నందిగామ పరగణా కు రాజా వాసిరెడ్డి వీరప్ప నాయుడు 1670లో సర్ దేశముఖ్ గా గోలుకొండ సుల్తానులు నియమించి నట్లు తెలుస్తుంది. కానీ వీరిని జమీందారు/ రాజా గానే పిలవబడ్డాడు. 

ఈ నాటికి తెలంగాణా, మహారాష్ట్రలలో ఈ దేశముఖ్ పేరు కన్పిస్తుంది. కోస్తా ఆంధ్ర ప్రెంచ్, ఇంగ్లీష్ వారి చేతిలోకి పోవటం వల్ల దేశ్ ముఖ్ లు ఇక్కడ కనపడరు. అలాగే రాయలసీమ ప్రాంతంలో చౌదరి కానీ, దేశ్ ముఖ్ లు గాని కనిపించరు.      

గ్రామ మన్సుబులుగా,కరణాలగా (తెలంగాణలో పటేల్, పట్వారి) పనిచేసిన వారిలో ఎవరికీ  ఇవి వారి కులనామంగా మారలేదన్నది గమనార్హం. కానీ కమ్మవారిలో ఒక కుటుంబపెద్ద చౌదరిగా వ్యవహరించినప్పుడు (సమితికి కానీ  గ్రామానికి కానీ) వారి వంశంలోని వారందరు చౌదరి కుటుంభంగా పిలవబడేవారు. తాత పేరు మనుమడికి పెట్టే సాంప్రదాయం వల్ల ఆయా కుటుంబాలలో తరువాత తరలవారు చౌదరి తనం (మన్సబ్ పదవి) చేసినా చేయక పోయినా  వారి పేరులో చౌదరి కొనసాగటం గమనించవచ్చు. 

ఇదే తీరు రాయలసీమ కమ్మవారి పేరులో నాయుడు అనే మకుటం కనిపిస్తుంది. 'నాయుడు' అంటే సేనా నాయకుడు/ దండనాయకుడు అనే రాజలాంఛన నామం కూడా వారికి వారసత్వంగా వచ్చినట్లు కనపడుతుంది. దండనాయకులుగా, మండలాధిపతులుగా, పాలకులుగా పనిచేసిన తమ పూర్వీకుల నుండి సంక్రమించి 13వ శతాబ్ది నుండి  వంశపార్యంగా కమ్మవారిలో కొనసాగుతూ వస్తుంది. అలాగే నాయుడు/రాయుడు  అంటే కాపు కులం అనే ధోరణి కూడా ఒక అపోహ మాత్రమే. 

కొంత మంది కమ్మ వారు ఇప్పుడు తాము చౌదర్ల మని చెప్పుకోటం ఒక ఫ్యాషన్ గా మారింది. వీరు కమ్మ కుల నామ వైశిష్టం తెలుసుకోవాలి. కమ్మవారుగా పిలిపించుకోవటానికి సిగ్గు పడనవసరం లేదు.పేరులో చౌదరి ఉన్నవారు తప్పా, మిగిలిన వారు చౌదరి బిరుదు తగిలించుకోవటానికి వెంపరలాడటం మంచిది కాదు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందినవారు మాత్రమే చౌదరి మకుటం ధరించితే కమ్మ కుల ప్రతిష్ట మరింతగా ఇనుమడించగలదన్న నా సూచనను విజ్ఞులు పరిశీలించగలరు. 

చౌదరి, నాయుడు అనేవి ఒకనాడు సమాజానికి దశ దిశ నిర్దేశించిన  కమ్మవారి గౌరవ వైభవ చిహ్నాలు. వీటిని అగౌరపర్చటం, వెటకారం చేయటం సహించరాని విషయం.  --- ఆచార్య కొడాలి శ్రీనివాస్   

Comments

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు ది