Skip to main content

మన అపార్టుమెంట్ జీవిత కాలం ఎంత?

నేటి నగర జీవనంలో ఎక్కువ మందికి వసతి కల్పిస్తున్నవి అపార్టుమెంటులే అనేది వాస్తవం. సొంత ఇంటి కలను నిజం చేసుకోవటానికి ప్రతి కుటుంబం తాపత్రయ పడుతుంది. 
శుభాశుభ కార్యక్రమాలు స్వగృహంలోనే జరుపుకోవాలనేది సర్వదా వ్యాప్తి చెందిన సూత్రం. అద్దె ఇంటి అగచాట్లు, నిలకడ లేని చిరునామా, అందంగా, పొందికగా సొంతఇల్లు ఉండాలనే కోరికలు, అభిరుచులు, తిన్నా తినక పోయినా గుట్టుగా తలదాచుకునే ఒక గూడు సమకుర్చుకోవాలనే తపన ... వెరిసి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి వ్యక్తి మదిలో ఏదో ఒక సమయాన ఉదయిస్తుంది. 
పెళ్లి అయిన ప్రతివారు తమకంటూ ఒక ఇల్లు కావలనుకొంటారు. స్థలం తీసుకొని తనకు నచ్చినట్లు నాణ్యతగా ఇల్లు కట్టుకోవాలంటే ఈనాడు కుదిరే విషయం కాదు. అందుకే మనవారు 'ఇల్లు కట్టి చూడు , పెళ్లి చేసి చూడు'  అని అన్నారు. ఈ నానుడి నేటి పరిస్థితులలో కొద్దిగా మార్చుకోవాలి, 
'ఇల్లుకొని చూడు-పెళ్లిచేసి చూడు' అని అంటే వాస్తవానికి అతికినట్లు సరిపోతుంది. 
అనేక మంది ముఖ్యంగా మధ్య తరగతి వారు, ఉద్యోగులు తమ జీవితకాలం కష్టించి పైసా పైసా కూడబెట్టిన సొమ్ముకు బ్యాంకు  అప్పు జోడించి తమ ఆర్దికశక్తి తగ్గ అపార్టుమెంటును  కొంటున్నారు. 
కాని ఈ కొనుగోలు చేసిన అపార్టుమెంటు  మన్నికైనదేనా దాని యొక్క జీవిత కాలం ఎంత? అనే విషయం పెద్దగా గమనిస్తున్నట్లు లేదు. అపార్టుమెంటు పై పై మెరుగులు చూసి మోసపోతున్నారు. 
పడక గదులు ఏ దిక్కులో ఉన్నాయి, వంట గది వాస్తు ఎలా ఉంది, ప్రధాన ద్వారం ఏ దిశకు ఉంది, ఫ్లోరింగ్ కు ఏమి వాడారు, రకరకాల రంగులు తో మెరుగులు అద్దిరా లేదా? వంటి సదా సీదా విషయాలకు ఇచ్చినంత ప్రాధాన్యం దాని నిర్మాణం ఎలా చేసారు, నాణ్యమైన వస్తువులు ఉపయోగించారా, సాంకేతిక సలహాలను పాటించారా లేదా, బిల్డర్ ఎలాంటి వాడు? అనే విషయాలకు ఏమాత్రం విలువ ఇవ్వకపోవటం శోచనీయం. 
ధర తగ్గించి, తాయిలాలు ఎర వేసి, వాస్తు వాసన చూపి, పగుళ్ళకు లప్పం పూసి, నాసి రకం కలపకు మక్కు పెట్టి ముస్తాబు చేసిన 'బంగారు లేడి'ని మనకు అంటగట్టే మారిచక ప్రభుద్దులు బిల్డర్ అవతారం లో ఉంటారని తెలుసుకోండి. 
అపార్ట్ మెంట్ బలం 'వాస్తులో' లేదని, దానికి వాడిన 'వస్తువుల బలం' లోనే ఉందన్న సంగతిని గమనిచండి.

అపార్టుమెంట్ల ఆయుర్దాయం ఎంత? 

మనిషికి ఆయుర్దాయం నూరు ఏళ్ళు అయితే సాంకేతిక నిపుణుల పరివేక్షణలో, ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటిస్తూ నాణ్యమైన వస్తువులతో , సాంకేతిక విలువలను పాటిస్తూ నిర్మించిన అపార్టుమెంట్ అయితే అది దాదాపు 60 నుండి 70 ఏళ్ళు మనుగడ సాదిస్తుంది. 
'మేస్త్రులు మేడలు కడితే కుక్కతోక తగిలి కులిందట' అనే నానుడి నిజం చేసే పరిస్థితులు కన్పిస్తున్నాయి. నాసిరకం వస్తువులతో లాభాపేక్షతో కట్టిన అపార్ట్ మెంట్ అయితే 10 ఏళ్ళకే మరమ్మతులు కొరకు ఎదురు చూస్తుంది. గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదన్నట్లు కొన్నాళ్ళకు వీటిపై వచ్చే అద్దె కంటే వాటి మరమ్మతు లకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇలాంటి అపార్ట్ మెంట్లు 30 ఏళ్ళు మనుగడ సాధించటమే గొప్ప. తుపానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులకు ఇలాంటి భవనాలు ఏమాత్రం తట్టుకోలేవు. 
తేమ ప్రదేశాలలో కాని సముద్ర తీరప్రాంతలలో గాని కట్టినవి అయితే కాంక్రీటులో ఉన్న స్టీలు తుప్పు తిని 20 ఏళ్లకే పెచ్చులు ఊడి కూలటానికి సిద్దంగా ఉంటాయి. సరైన నీటి పైపులు వేయకపోవడం, బాత్రూమ్ లో నీరు లీకు అవటం తద్వారా గోడల్లో తేమ చేరటం వల్ల కూడా అపార్టుమెంటు ఆయుష్షు తగ్గుతుంది. 
ఇలాంటి నాణ్యత లేని అపార్ట్ మెంట్లు కొనుక్కొని దానికి తరచూ మరమ్మతులకు చేసుకుంటూ, 'ఎరక్కపోయి ఇరుక్కున్ననే' అని నానా అవస్థలు పడుతూ ఉంటారు. 
ఇంటి పై చేసిన 'అప్పు' తిర్చేసరికి అపార్టుమెంటు ఆయుస్సు తీరి అంతిమ యాత్రకు (శిధిలావస్థకి) సిద్దంగా ఉంటుంది. చివరికి చేతికి 'చిప్ప' మిగులుతుంది. తస్మా జాగ్రత్త !
అపార్టుమెంటు కొనేముందు దాని వాస్తు, సౌకర్యం, సౌందర్యలతో పాటు దాని నిర్మాణానికి సంబందించిన విషయాలలో నాణ్యతకు, దృడత్వానికి చెందిన అన్ని విషయాలు నిశితంగా గమనించండి. లేకుంటే తరువాత వగచినా ప్రయోజనం శూన్యం. అపార్టుమెంట్ కొనుగోలు చేసేముందు రేరా చట్టం గురించి అవగాహన చేసుకోవాలి. ఈ చట్ట పరిధిలో నమోదు చేసుకొన్న ప్రాజెక్టులలో మాత్రమే కొనుగోలు చేస్తే మీ డబ్బుకు భద్రత మరియు మీ ఇంటికి రక్షణ కలుగుతాయి.

నిర్మాణాలలో నిబంధనలు పట్టవా?  

బహుళ అంతస్థుల భవన నిర్మాణాల విషయంలో ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేసాయి. 15 మీటర్లు (50 అడుగులు) ఎత్తుకు పైబడిన భవనాలు ఈ చట్ట పరిధిలో ఉంటాయి. 

1.  మునిసిపల్ బైలా డెవలప్ మెంట్ కంట్రోల్ రెగ్యులేషన్ 

2. జాతీయ భవనాల చట్టం NBC -1983

3. A.P  అగ్నిమాపక చట్టం -1999

ఈ చట్టాలలో చెప్పిన నిబంధనల ప్రకారం కనీసం 50 వేల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకులు భవనం కింది భాగంలోనూ, పైనా నిర్మించాలి. భవనం చుట్టూ 6 మీటర్ల కాళీ ప్రదేశం ఉండాలి. అగ్ని ప్రమాదాలను ముందుగా తెలియజేసే అలారం ఏర్పాటు చేయాలి. నాణ్యమైన విద్యుతు తీగలను, మెటల్ కండక్టర్లు, పరికరాలు వాడాలి.    

4. రేరా చట్టం RERA - ACT 

The Real Estate (Regulation and Development) Act, 2016

స్థిరాస్తి రంగంలో పారదర్శికత మరియు నియంత్రణ కొరకు ఏర్పరిచిన రేరా చట్టం నేడు అమలులో ఉంది.ఈ రేరా చట్టం ప్రకారం కొనుగోలు దారునికి అనేక హక్కులు లభించాయి. 
  • ఎనిమిది కంటే ఎక్కువ లేక 500 చదరపు మీటర్లు కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు తప్పనిసరిగా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. 
  • కొనుగోలుదారుని నుండి వసూలు చేసిన డబ్బులో 70 శాతం బ్యాంకు అకౌంట్లో ఉంచి ప్రతి రూపాయకు లెక్కా జమ ఉండాలి. 
  • ప్రాజెక్టుకు సంబందించిన ప్రతి ఒక్క అంశం అధికారిక వెబ్సైటు లో ఉంచాలి. 
  • అపార్టుమెంటు లో కార్పెట్ ఏరియా (గోడల లోపల ఉన్నస్థల విస్తీర్ణం) బట్టి ధర ఉండాలి. సూపర్ బిల్ట్ ఏరియా అంటూ అందరికి ఉపయోగపడే కారిడార్లు, లిప్ట్ , మెట్లు ,బాల్కనీ,లాబీ ల విస్తీర్ణం కలిపితే వచ్చే విస్తీర్ణం బట్టి డబ్బు అడగరాదు. 
  • అనుకొన్న సమయానికి నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారునికి ఇవ్వలేని పక్షంలో వారు చెల్లించిన డబ్బుకు బ్యాంకు వడ్డీ పై అదనంగా 2 శాతం కలిపి బిల్డర్ చెల్లించాలి. 
  • కొనుగోలుదారు అపార్టుమెంటు స్వాధీనం చేసుకొన్న తరువాత 5 సంవత్సరాలు లోపు వచ్చే అన్ని మరమత్తులు బిల్డరే  చేయాలి. 
  • స్థలం హక్కు పత్రం (టైటిల్ డీడ్) లో ఏవైనా అవతవకలు ఉంటె నష్ట పరిహారం పొందే హక్కు కొనుగోలుదారునికి ఉంది. 
  • కొనుగోలుదారు తో వచ్చే వివాదాలను 120 రోజులలో బిల్డర్ పరిష్కరించుకోవాలి. 
ఆచార్య కొడాలి శ్రీనివాస్ 

Comments

Anonymous said…
Adbhutham guruu....chaalaa manchi nijaalu bayata pettavu. Kaani okka maata ......follow ayye vaallu vunnaara? Fengshui...ani vaasthu ani verri chestalu chese Adangulaki ee civil engineer cheppe nijaalu burralo duuruthaayaa?
మిత్రమా! ఎవరు విన్నా ,వినకున్నా సత్యాన్ని బహిర్గతం చేసే భాద్యత మనపై ఉంది. అనగ అనగా రాగం ఇంపుగా మారునట్లు, తినగ ,తినగా వేప పండు తీయగా మారునట్లు మనం చెప్పగా , చెప్పగా చెవిలో దురతాయి అని చిన్ని ఆశ.
వజ్రం said…
మీరు చెప్పింది అక్షర సత్యం. ఈ కాలం లో బిల్డర్ లు పైపై మెరుగులతో ముస్తాబు చేసి అమ్మేస్తున్నారు. మీరు పదేళ్ళని అన్నారు కానీ ఐదేళ్ళకే రిపేర్లు అవసరమవుతున్నాయి. ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత తీసుకోవాలి. థర్డ్ పార్టీ ఇంజినీర్లతో ప్రతి అపార్ట్మెంట్ కీ క్వాలిటీ టెస్ట్ కంపల్సరీ చేస్తే బాగుంటుంది.
Unknown said…
Nobody worries about the life period of an apartment..it should be discussed in wide range....thanks for your article sir..

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర 

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు ది