Skip to main content

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 5


EI - విజయవాడ - రచయత ఆచార్య కొడాలి శ్రీనివాస్
వాస్తు పేరుతో సమాజంలో మౌఢ్యం రాజ్యమేలుతుందని, వాస్తు ఫలితాల చూపి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న వాస్తు ఫలితాలలో నిజం ఏమాత్రం లేదని, రావిపూడివారు 'వాస్తువు శాస్త్రమా? ' లో అడుగడునా పలుమార్లు నొక్కిచెప్పారు. ఇలా ఇంతకుముందే వాస్తు ఫలాలు అబద్దాలని చెప్పిన ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, హేతువాదులు, నాస్తికులు అనేక మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు వాస్తు శాస్త్రం అనేది ఒకనాటి భారతీయ నిర్మాణ శాస్త్రం అనే వాస్తవాన్ని అంగీకరించటానికి ఏమాత్రం సంకోచించలేదు. కేవలం రావిపూడి వెంకటాద్రి వంటి ఒకరిద్దరు మాత్రమే ఈ వాస్తవాన్ని గ్రహించటానికి సంసిద్దంగాలేరు. 
ఏ విషయమైనా విమర్శకు గురి అయితేనే దానిలో లోటుపాట్లు బహిర్గతం అవుతాయి. క్రీ.పూ.4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే 16వ శతాబ్దం వరకు ప్రాచుర్యంలో ఉండేవి. వీరి రచనలను విమర్శించటం ఆనాడు మతద్రోహంగా భావించేవారు. అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు గల రెండు వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువుగల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుకుంటుంది. ఇది తప్పు అని గెలీలియో నిరూపించాడు. పీసా గోపురం 180 అడుగుల ఎత్తు పైనుంచి 100 పౌండ్లు, 1 పౌండు బరువు గల రెండు ఇనప గుండ్లను ఒకేసారి క్రిందికి వదలి, అవి రెండూ ఒకే కాలంలో భూమిని చేరుకుంటాయని ప్రయోగం ద్వారా రుజువు చేసాడు. సిద్ధాంతం, ప్రయోగం, రుజువు చేయగలిగిన ఇలాంటి వాటినే మనం శాస్త్రీయ ప్రయోగాలని అంటాం. భౌతిక ప్రయోగ పరిధిలోకి రాని అభౌతిక వాస్తు ఫలితాలను ఎలా రుజువు చేయగలరో రావిపూడి వారు సెలవియ్యాలి. మరల వారే వాస్తు ఫలితాలు వాస్తవం కాదు కాబట్టి వాస్తవం కానిదేదీ శాస్త్రం కావడానికి వీలు లేదని అంటారు. "పూర్వం వాస్తు శిల్పులు (వాస్తు పండితులు కారు సుమా) గృహనిర్మాణంలో ఆయా ప్రాంతాలలో దొరికే సామాన్లను బట్టి వాటి గట్టితనాన్ని బట్టి, అవి మోయగలిగే బరువునుబట్టి గదుల కొలతలు నిర్ణయించేవారు" అని అంటూ "ఇల్లు కట్టించే వాడి వాస్తువు వేరుగా పడగొట్టించే వాడి వాస్తువు వేరుగా ఉండేది శాస్త్రం ఎలా అవుతుంది?" అని పరస్పర విరుద్ధంగా ప్రశ్నిస్తారు. ఇంకా వారి పుస్తకానికి టాగ్ లైన్ 'Is Geomancy a Science' అని పెట్టారు. చైనాలో స్మశానంలో ముగ్గులులేసి రంగులు చల్లి మంచి చెడులు చెప్పే మార్మిక కళను జియోమెన్సీ అని అంటారు. జియోమెన్సీ తో వాస్తువుకి ఏమి సంభంధం ఉందో వారికే తెలియాలి. తాత మోకాటికి అవ్వబోడి తలకు ముడివేసినట్లు వాస్తును జియోమెన్సీకి  లంకె పెట్టారు. రావిపూడి వారి రాతల తీరు చూస్తే ఎక్కడ వాస్తును ప్రాచీన నిర్మాణశాస్త్రంగా అంగీరించవలసి వస్తుందోనన్న తడబాటు వాటిలో కన్పిస్తుంది. 

రాజీపడని విజ్ఞానం 

వాస్తువు శాస్త్రమైతే దానికి ఉన్న ప్రాతిపదికలు ఏమిటో చెప్పాలని రావిపూడి గారు పదేపదే అడిగారు. వారు ఒప్పుకున్నా లేకున్నా వాస్తు అనేది ముమ్మాటికీ ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రమే. ఇది సమగ్రమైనదా, లోటుపాట్లు లేవా అనే విషయం ఇక్కడ చర్చకాదు. చరిత్రను పరిశీలిస్తే వాస్తు శాస్త్రం 10వ శతాబ్దం వరకు ప్రగతి పథంలో పయనించి ఆతరువాత ఎదుగూబొదుగులేక నిర్జీవ శాస్త్రంగా మిగిలిపోయింది అని తెలుస్తుంది. అందువల్లే ఈ శాస్త్రంలో ఉన్న నిర్మాణ విషయాలు నేటి ఆధునిక నిర్మాణాలకు ఎంత మాత్రం ఉపయోగపడని మాట వాస్తవం. కాలానుగుణంగా సివిల్ ఇంజినీరింగులో వచ్చిన సాంకేతిక విజ్ఞానాన్ని జోడించు కుంటూ ఇది వృద్ధి చెందలేదన్న కారణం చేత దీనిని నిర్మాణ శాస్త్రం కాదని త్రోసివేయజాలం. హిందూ దేవాలయాల నిర్మాణంలో ఇప్పటికి వాస్తు సూత్రాలే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం పరిగణలోకి తీసుకోవాలి. మనం అవునన్నా కాదన్న ఈ సమాజం మంచిగానో, చెడ్డగానో ఒక క్రమపద్ధతిలో నిర్మించిబడినది. నిర్మాణాలలో ఒక క్రమం ఉందంటే దానిలో ఎంతోకొంత విజ్ఞానం ఉన్నట్లే కదా! అలాగే ఆనాటి నుండి నేటివరకు జనం చెట్లపైనా , పుట్టల్లోనూ, గుహల్లోనూ ఉండలేదు కదా ! ఏ మాత్రం శాస్త్రజ్ఞానం లేకుండానే గ్రామాలు, నగరాలు, పట్టణాలు ఏర్పడ్డాయా? కోటలు, మేడలు, మిద్దెలు, దేవాలయాల వెనుక నిర్మాణశాస్త్రం పాత్ర లేదని  ఎలా తీర్మానించగలరు? గృహోపకరణాలు, ప్రయాణ సాధనాల తయారీ వెనుక, చెరువులు, జలాశయాలు, ఆనకట్టలు వంటివి ఏర్పాటు చేయుటలో వాస్తువు పాత్ర లేదని ఎలా చెప్పగలరు? వీటి అన్నిటి వెనుక ఆనాడు వాస్తు శాస్త్రం ఉందని చెప్పటానికి నాకెటువంటి భేషజాలు లేవు, అజ్ఞానంతో రాజీపడవలిసిన అగత్యం అంతకంటే లేదు.
అయితే నేడు వాస్తు పేరుతో సమాజంలో చలామణిలో ఉన్న విషయాలలో వాస్తులో ఆనాడు చెప్పిన నిర్మాణ విషయాలు లేవు. ఇంటికి పునాదులు ఎలా ఉండాలి , పిల్లర్లు, బీములు, స్లాబులు ఇత్యాది విషయాలలో నేటి నవీన విజ్ఞానమే వాడుతున్నాం. ఈ నిర్మాణ విషయాలలో ఆనాటి వాస్తును పాటించక పోయినా రాని కష్టనష్టాలు మిగిలిన విషయాలలో పాటించక పోతే వస్తాయని చెప్పటం పెద్ద మోసం.  

వాస్తు ఫలితాలు నమ్మాలా? 

ఒకనాడు ఇంటిని కట్టుకోవాటానికే ఈ వాస్తు (నిర్మాణ శాస్త్రం) రూపొందినదని ఇంటిని కూలగొట్టు కోవటానికి కాదు. కుటుంబంలో వచ్చే ఆర్థిక, ఆరోగ్య, అనుబంధ సమస్యలకు వాస్తు ఎంతమాత్రం కారణం కాదని విస్పష్టంగా వివరిస్తూ నేను చెప్పింది రావిపూడి గారు పట్టించుకోలేదంటే అసలు వారు నా రచనలు ఆసాంతం చదివారా లేదా అని సందేహం వస్తుంది. 
నేడు వాస్తు పేరుతో చెబుతున్న సవాలక్ష అబద్దాలు, అతిశయోక్తులుకు అడ్డు కట్ట పడాలంటే ముందు పూర్వం వాస్తులో చెప్పింది ఏమిటో తెలుసుకోవాలి. నవీన వాస్తు పేరుతో విషయాలను వక్రీకరించి వంచనకు పాలుపడుతున్న వారిని అదుపు చేయాలంటే వాస్తులో చెప్పబడిన ఫలితాలపై అవగాహన కల్పించాలి. 

మన ప్రాచీన శాస్త్రాలలో మంచి, చెడులను చెప్పటానికి, ఆచరణ కొరకు అనేక విధాలుగా ఆశ భయాలను కల్పించేలా ఫలితాలు చెప్పేవారు. అనేక వ్రత పూజా విధానాలలో కూడా ఈ తరహా ఫలితాలు గమనించవచ్చు. వీటినే అర్ధవాదలు అంటారు. వాస్తులో చెప్పబడిన ఫలితాలను 'అర్దవాదలు' గా తీసుకోవాలి. ఇవి పసి పిల్లలను కట్టడి చేయటానికి బూచి ఉందని చెప్పే చందాన ఉన్నాయి. వాస్తు ఫలితాలను రుజువు చేయమని అడగవలిసిన ఆవశ్యకత కూడా లేదు. 

నేడు చలామణిలో ఉన్న ఈ అశాస్త్రీయమైన వాస్తుతో అందరిని కొంత కాలం మోసం చేయవచ్చు, కొందరిని మరికొంత కాలం మోసం చేయవచ్చు. కానీ ఎవ్వరిని ఎల్లకాలం మోసం చేయలేమనేది కఠోర సత్యం. పిల్లి శాపాలకు ఉట్లు తెగనట్లుగానే, వాస్తుతో అద్భుతాలు సంభవిస్తాయని అనుకోవటం అజ్ఞానం. అర్ధం లేని విశ్వాసాలకు, కాలదోషం పట్టిన సూత్రాలకు నేటి సమాజంలో స్థానాన్ని కల్పించటం అవివేకం. చాందస భావాలను విడిచి విశ్వవ్యాప్తంగా పురోగమిస్తున్న సాంకేతిక విజ్ఞానాన్ని సాదరంగా స్వాగతం పలుకుదాం.

ముగింపు 

నా పుస్తకం 'వాస్తులో ఏముంది?' రచనా కాలానికి (1996) రావిపూడి వెంకటాద్రి గారు కానీ మరి ఏ ఇతర నాస్తిక హేతువాదులతో, సంఘాలతో నాకు పరిచయమే లేదు. మొదటసారి 1999 లో ప్రచురించిన రావిపూడి  వెంకటాద్రి గారి రచన వాస్తవు శాస్త్రమా? చదవటం ఆతరువాత  వారిని చీరాలలో కలవటం జరిగింది. నా పుస్తకంపై వారి విమర్శకు వివరణ ఇవ్వటం జరిగింది. ఆ తరువాత వారితో కలిసి నేను గుంటూరు, తెనాలి  సభలలో కూడా ప్రసంగించటం జరిగింది. 2001 జనవరి 1న నా రచన 'వాస్తులో వాస్తవాలు'  విడుదలై వచ్చింది.  హేతువాద సంఘం వారి ఆధ్వర్యంలో తిరుపతి, ఒంగోలు, చీరాల, మిరియాలగూడ లో జరిగిన సభలలో ప్రధాన వక్తగా ప్రసంగించాను. అయినా ఎందుకో (?) వారు తన వాదనకే కట్టుబడి దానినే 'వాస్తువు శాస్త్రమా?' రెండవ ముద్రణలో సమాజానికి అందజేశారు. వారు తన పుస్తకంలో పేర్కొన్నవాస్తు సంవాదం పేరుతో  "విజయ విహారం" పత్రికలో నేను రాసిన వ్యాసం 'వాస్తు సజీవ శాస్త్రమా?' కూడా ఉంది. కానీ దాన్ని రావిపూడి వారు పట్టించుకోలేదు కానీ 'హేతువాదులు గాడిదను గుర్రాన్ని ఒకే గాటను కడతారని'  అదే పత్రికలో రాసిన వ్యక్తి మాటలలో తనకు పనికివచ్చే మాటలు తీసుకొని వాటిని  ఉదహరించారు. జ్యోతిష్యం నిజం, వాస్తు అబద్దం అనే భావాలతో ఉన్న సదరు వ్యక్తి వీరి విమర్శకు దూరం. 
 
తప్పును తప్పు అనలేకపోవటం కూడా తప్పే. హేతుబద్ధం కానీ వాదనలు, సిద్ధాంత అభిజాత్యం మూఢత్వాన్ని బాటలు వేస్తాయనే భావనతో ఈ వివరణాత్మక విమర్శ రాయటం జరిగింది. దీనిలో చర్చించిన విషయాలన్నీ 12-08-2001 లో నేను రావిపూడి గారికి రాసిన ఉత్తరం లోనివేనని గ్రహించగలరు.

నేటి వాస్తు సిద్ధాంతుల రాద్ధాంతాలను ఎండగట్టి ఉతికి ఆరేయటంలో రావిపూడి వెంకటాద్రి గారి చేసిన తర్కంలో కొన్ని లోపాలు ఉన్నా వారు ఫలితాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలలో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. వారి చిత్త శుద్ధిని శంకించటం లేదు. హేతువాద, మానవవాద ఉద్యమంలో అవిరామంగా చేసిన వారి కృషి అభినందనీయం. మూఢవిశ్వాసాలపై వారు దీర్ఘకాలంగా సాగించిన పోరాటం అనన్యసామాన్యం. అలాగే హేతుబద్ధ విమర్శలను స్వీకరించి తన రచనలను కొనసాగించాలని కోరుకుందాం.    
సమాజహితాన్ని ఆశిసించి సదుద్దేశంతో ప్రాచీన వాస్తులో చెప్పబడిన విషయాలను వివరిస్తూ 1996 లో రాసిన నా పరిశోధనా గ్రంథం వాస్తులో ఏముంది?.  నేడు వాస్తు పేరుతో కొనసాగుతున్న అశాస్త్రీయ పోకడలను, వాస్తు మాటున జరుగుతున్న వంచనలోని గుట్టుమట్టులను బహిర్గతం చేసిన తొలి పరిశోధనా గ్రంథం. 
28-12-1996 లో ప్రచురించబడిన ఈ పుస్తకం విడుదలై ఈ ఏడాది 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్నది. ఈ రజితోత్సవ సందర్భంగా ప్రచురించాలనుకొంటున్న రెండవ ముద్రణలో ఈ వ్యాసం చేర్చబడుతుంది.
ఆచార్య కొడాలి శ్రీనివాస్ 

Comments

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం...

వాస్తు లో కుల బీజాలు !!!

వాస్తు లో కుల బీజాలు !!! హిందూ సమాజం లో లోతుగా వేల్లూ రుకున్న కుల వృక్షం యొక్క బీజాలు మనకు వాస్తు శాస్త్రం లో చాలా స్పష్టంగా కనబడతాయి . గ్రామా / పట్టణ / నగరాల లో ఏ వర్గం ( కులం / వర్ణం ) ఏ దిశలో ఉండాలో ఆనాటి వాస్తు గ్రంధాలల్లో చెప్ప బడింది .సమాజంలో ఆనాడున్న వృత్తులను బట్టి , జాతులను బట్టి వారి నివాసాలు ఎక్కడ ఉండాలో నిర్ణయం చేయబడింది . దీనివల్ల తరతరాలగా మన సమాజం వర్గాలుగా , కులాలగా విభజింప బడినది . వృత్తు ల మద్య అంతరం మనుష్యుల మధ్య విభజనాన్ని శాశ్వితం చేసాయి . వాస్తు శాస్త్రం లో చెప్పబడిన కొన్ని విషయాలను పరిశీలించితే కుల సమాజం యొక్క బలమైన పునాదులు కనపడతాయి . బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర వర్ణాలు కు వారి నివాసాలు గ్రామ/పట్టణాలలో ఎలా వుండాలో ,ఎక్కడ ఉండాలో చెప్పటమే కాకుండా అక్కడ నేలకు రంగు , రుచి , వాసన , ఎలా వుండాలోకుడా చెప్పబడినది . ౧. బ్రాహ్మణ లు: ఉత్తర దిశలో ఇల్లు/ వాకిలి ౨. క్షత్రియ : తూర్పు దిశలో ఇల్లు/ వాకిలి ౩. వైశ్య : దక్షణ దిశలో ఇల్లు/ వాకిలి ౪. శూద్ర : పడమర దిశలో ఇల్లు/ వాక...

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం ఒక వ్యాసం చేసే పనిని ఒక కార్టూన్ చేస్తుంది .జెట్ స్పీడ్ తో జనం లోకి దూసుకుపోతోంది . అందుకే సమాజ శ్రేయసునుదృష్టిలో పెట్టుకొని వాస్తు పేరుతొ జరుగుతున్నవెర్రి మొర్రి పనులను , అజ్ఞానం తో,అనాలోచనతో సాగించే పిచ్చి పనులనూ పదుగురికి తెలిసేలా, సూటిగా ,సున్నితంగా ,నవ్వించేలా వుండి వాస్తు పై ఆలోచింపచేసే కార్టున్లకు ఆహ్వానం . త్వరలో నేను ప్రచురించే పుస్తకం " వాస్తు అంటే ఇదేనా? " లో వీటిని ప్రచురిస్తాను . తగిన పారితోషకం ఉంటుంది . అలాగే మీకు తెలిసిన /చూచిన పాత కార్టున్ లు నాకు పంపిచండి .వాటన్నిటికి విస్త్రుత ప్రచారంలోకి తీసుకురావటంలోమీవంతు సహకారం అందించండి .