Skip to main content

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 4

అర్థాలు - అపార్దాలు 

వాస్తు శాస్త్ర మూల గ్రంథాలన్నీ సంస్కృతం లోనే ఉన్నాయి. నేడది మృత భాష. సంస్కృత భాష విలక్షణమైనది. భాష విస్తృతం కానప్పుడు ఓకే పదం అనేక అర్ధాలతో ప్రయోగించటం సర్వ సాధారణం. సాహిత్య ప్రయోగంలో వాడకలో ఉన్న ఒక పదాన్ని విభిన్న అర్థాలతో వాడటం కవుల కల్పనా  శైలికి తార్కాణంగా పేర్కొంటారు. విషయాన్ని బట్టి పదం యొక్క అర్థాన్ని స్వీకరించితే  అర్ధవంతమైన భావం సిద్ధిస్తుంది. గణిత, ఖగోళ, వైద్య, వాస్తు  ఇత్యాది శాస్త్ర గ్రంధాలలో వాడిన పదాలకు తత్సంబంధమైన శాస్త్ర పరి భాష అర్థాలలో  హేతుబద్దమైనవి మాత్రమే అన్వహించుకోవాలి. వాడుక అర్థాలు స్వీకరించ రాదు. 


వాస్తు శాస్త్రం అనేది మన సమాజంలో ఆదినుండి, ఆధునిక నిర్మాణాలు వచ్చే వరకు తనవంతు తోడ్పాటు అందించిదన్నది వాస్తవం. ఈ కోణంలోనే నిర్మాణ విషయంలో ఉపయోగించిన పదాలకు సాంకేతిక అర్థాలు స్వీకరిస్తే వాస్తుపై మరింత స్పష్టత వస్తుందని చెప్పుతూ నేను రాసిన పుస్తకమే 'వాస్తులో వాస్తవాలు'.  పుస్తకంలో ప్రస్తావించబడిన సాంకేతిక పదాల అర్థాలు రావిపూడి వెంకటాద్రి గారికి  కృత్తక అర్దాలుగా, విపరీతార్థలగా కనిపించాయట. వాస్తులో ఉన్న శ్లోకాలు తెలుగు బాగా వచ్చిన వారికి సులభంగా అర్ధం అవుతాయని వీటిలో నిగూఢమైన అర్ధాలు లేవని, సాంకేతిక పదాలమయం కాదంటూ లేవనెత్తిన వారి అభిప్రాయాలు 'వాస్తువు శాస్త్రమా?' రెండవ ముద్రణలో ప్రత్యేక అనుబంధంగా చేర్చారు. 

అవగాహన ఏది?

వాస్తులో చెప్పబడిన దోషాలు (నిర్మాణాల్లో సాధారణంగా జరిగే తప్పులు) వాటి వల్ల వనగూడే ఫలితాలు వల్ల నేడు సమాజంలో భయాందోళనలు చోటు చేసుకున్నాయి. వివిధ అంశాలలో కలగాపులగంగా ఉన్న ఈ వాస్తు దోషాలను ఆవాసాల నిర్మాణంలో వచ్చే సాంకేతిక దోషాలగా, ఇంగిత జ్ఞానం కు సంభందించిన సాధారణ దోషాలగా, సమాజ నియంత్రణలో భాగంగా ఏర్పడిన సామాజిక దోషాలుగా మూడు తరగతులుగా విభజించి పరిశీలించాలి. 

వాస్తుశాస్త్రం రావిపూడి గారు భావిస్తున్నట్లు సాదాసీదా గ్రంథం కాదు. సాంకేతిక పదజాలంతో పరిచయం లేని మహామహ సంసృత పండితులకే అర్ధంగాక ఇప్పటికి కొన్ని శ్లోకాలకు కేవలం తాత్పర్యం రాసి సరిపెట్టుకున్నారు. వాస్తుకు ప్రామాణికగ్రంథాలగా చెప్పబడే వాటిల్లో ముఖ్యమైనవి   'మయమతం' (ఇది 36 అధ్యాయాలతో 3300 శ్లోకాలతో ఉన్న గ్రంథం, డా. బ్రూనో దాగెన్సీ చే పరిష్కరించి అనువదించబడినది, 2 భాగాలు),  మరియు  'మానసారం' (ఇది 70 అధ్యాయాలతో 5400 శ్లోకాలతో ఉన్న గ్రంథం, ప్రసన్నకుమార్ ఆచార్య గారిచే పరిష్కరించి అనువదించబడినది, 7భాగాలు). వీటిని చదివిన, లేక కనీసం చూసిన వాస్తు సిద్ధాంతులు నేడు కాగడావేసి వెతికినా కనపడరు. మరి రావిపూడి వారు వీటిని చూసి అధ్యయనం చేసి తన అభిప్రాయం చెప్పారని భావించాలా? లేక సాదా సీదా ఫలిత వాస్తుకు పరిమితమైన శ్లోకాలు మాత్రమే చూసి ఒక అభిప్రాయానికి వచ్చారని భావించాలా?  ఒక విషయాన్ని చదవటం వేరు, తెలుసుకోవటం వేరు, అధ్యాయనం చేయటం వేరు. ఇది తెలుసుకోకుండా అహంకారపూరిత వైఖిరితోనో, పక్షపాతధోరణితోనో మొండి సిద్ధాంతాలను, పిడి వాదాలను  తలకెత్తుకొని సమాజంలో వ్యాప్తి చేయటం ప్రమాదకరం. ఈ జాడ్యం ఆస్తికులతో పాటు కొంతమంది హేతువాదులు, నాస్తికులలో కూడా చోటుచేసుకోవడం అత్యంత హేయం.    

సాంకేతక పరిభాషలో వంశం అంటే దూలం అని, కులం అంటే జనావాసం లేక గృహం అని, కుటిలం అంటే ఇంటి చూరు అని, బంధువు  అంటే తలుపులు, దూలాలు మొదలగు వాటిని పట్టిఉంచే కీలలు.  అలాగే  గర్భం అంటే గృహ మధ్య భాగం అని, కళత్రం అంటే కోట, దుర్గం  అనే అర్థాలు ఉన్నాయి. ద్రవ్యం అంటే నిర్మాణ వస్తువు అని, ధార అంటే నీటి ధార అనే అర్ధంలను స్వీకరించినప్పుడే సాంకేతిక దోషాల విషయంలో అర్థవంతమైన భావం వస్తుంది. వంశహాని, వంశ నాశనం, కుల క్షయం, కుల నాశనం, బంధు నాశనం, కళత్ర నాశనం, ద్రవ్య నాశనం, ధారా నాశనం  అనే వాటిని వాడుకార్థంలో స్వీకరిస్తే భయాందోళనలు వస్తాయనుటలో సందేహం లేదు. 'వాస్తు లో వాస్తవాలు' లో నేను ప్రస్తావించిన వాస్తు దోషాలు సాంకేతిక సంబంధించిన విషయాలకే పరిమితమని స్పష్టంగా చెప్పాను. అలాగే కాల దోషం పట్టిన ఈవిభాగంలో ఉన్న సాంకేతిక విషయాలు నేడు నిరుపయోగం. 

అయితే ఈ విభాగంలో గృహ రూపకల్పనలో చెప్పిన కొన్ని సాధారణ అంశాలు (గదులు, గుమ్మాలు, నీటివాలు, దిశలు వంటివి) మాత్రం కాలానుగుణంగా మార్పుచెంది ఇంకా కొనసాగుతున్నాయి. గృహ అమరిక దోషాలలో నీటివాలును ఉదహరిస్తూ ఉన్న ఫలితాలకు నేను చెప్పిన సాంకేతిక అర్థాలు పొసగలేదని అంటూ,  రావిపూడి వారు 'వాస్తు విద్య' అనే గ్రంథంలో చెప్పిన ఫలితాలు ఏకరువు పెట్టారు. 

నిజానికి తిరు అన్నన్ అనే కేరళ పండితుడు 16వ శతాబ్దంలో రాసిన 'వాస్తు విద్య' అనబడే ఈ పుస్తకం మూల గ్రంథం కాదు. ఇది కేరళ ప్రాంతానికే పరిమితమైన ఒక సంకలన రచన మాత్రమే. తూర్పు, ఉత్తర ఏటవాలు శ్రేష్టం అనే పాత విషయాన్ని ప్రాతిపదికగా చేసుకొని ఆ సూత్రాన్నే విస్తరిస్తూ (సంభావ్యత సిద్ధాంతానికి లోబడి వాగులు, వంకలు ప్రవాహాదిశలు మార్చుకుంటాయి అన్న ఊహ) కొత్తగా ఎనిమిది రకాల వాలుతలములు చెప్పారు. వాటికి  ఉన్న ఫలితాలు తూర్పు, ఉత్తర వాలు మంచిదేనన్న సూత్ర పరిధిలో కొత్తగా రూపకల్పన చేసినవే. వీటి పేర్లు యోని (ఆయం), వాస్తుపదస్థానం  పేర్లను బట్టి ఉండటం గమనించవచ్చు. సంస్కృతం వచ్చిన జ్యోతిష్య పండితులు రాసిన ఇలాంటి చాలా శ్లోకాలు స్వల్ప బేధాలతో జ్యోతిష్య, ముహూర్తవాస్తు పుస్తకాలలో కనబడతాయి. మన గ్రంథాలలో కాలానుగుణంగా అనేక ప్రక్షిప్తాలు చోటుచేసుకున్న విషయం మనమెరిగినదే. ఇలాంటి దోపుడు దోషాలతో పాఠకులు తంటాలు పడతారని సంక్షిప్తంగా ప్రస్తావించాను.  

గృహ అమరిక దోషాలతో పాటు ఇంగిత జ్ఞానంతో ముడిపడిన సామాన్య దోషాలలోను, సామాజిక దోషాలలో చెప్పిన ఫలితాలు నేడు సమాజానికి గుదిబండలా తయారైయ్యాయి. దోషరహిత నిర్మాణాలు చేయాలన్న ఉద్దేశంతో ప్రజలను కట్టడి చేయటానికే ఫలితాలను రాసి వాటిలో పైన పేర్కొన్న పదాలనే సామాన్య పరిభాషలో వాడారు. ముక్కుసూటిగా స్పష్టంగా ఉండేలా  దోష ఫలితాలను సూత్రీకరించటం వెనుక ఉన్న కారణాలు సుస్పష్టమే. ఇంగిత జ్ఞానంతో ముడిపడివున్న ఉన్న ఈ దోషాలు, వాటి ఫలాలపై రావిపూడి వారు వివరణ కోరారు. 'విశ్వకర్మ ప్రకాశిక'  అనే గ్రంధంలో చెప్పిన 16 రకాల ఫలితాలు ఉదహరిస్తూ అవన్నీ గృహస్థులను ఉద్దేశించే చెప్పారని, వంశ, కుల, బంధు, ద్రవ్యాది శబ్దాలకు నేను తీసిన అర్థాలు సరికావని చెప్పుతూ వాటి వెనకున్న వైజ్ఞానిక నిజాయితీని శంకించారు.   

'విశ్వకర్మ ప్రకాశిక' సమగ్రమైన వాస్తు గ్రంథంగా భావించలేము. దీనిలో నిర్మాణాలకు సంబంధించిన విషయాలతో జరిగే దోషాలను తెలిపే ఒక ప్రత్యేక అధ్యాయం 110 శ్లోకాలతో ఉంది. నిర్మాణాల విషయాలు లేకుండా ఇలా కేవలం దోషాలకు సంబంధించిన విషయాలు తో ప్రత్యేక అధ్యాయాన్ని కలిగి ఉన్న గ్రంథం విశ్వకర్మ ప్రకాశిక తరువాత 'సమరాంగణ సూత్రధార' మాత్రమే. దీనిని బట్టి వాటిని సంకలన గ్రంథాలుగా భావించవచ్చు. 

రావిపూడి గారు ప్రస్తావించిన 16 దోషాలు విశ్వకర్మ ప్రకాశికలో 10 శ్లోకాలలో చెప్పారు. తొలి ఆరు శ్లోకాలలో ఈ 16 దోషాలు గురించి చెప్పి, 14 దోషాలను మాత్రమే వివరించారు. ఈ దోషాలు ఉన్న గృహాన్ని నివాససానికి ఉపయోగించరాదని ముక్తాయింపు ఇచ్చారు. తిరిగి వాటివల్ల జరిగే ఫలితాలు మరో నాలుగు శ్లోకాలలో రాశారు.  వీటిలో ఫలితాలకు సంబందించిన పదాలలో వంశ, కుల, బంధు, ద్రవ్యాది శబ్దాలు లేనే లేవు. వివరణ చెప్పని రెండు దోషాలుకు (కుట్టుక వేధ, సుప్తక వేధ) కూడా ఫలితాలు ఇవ్వటం దాని సమగ్రత లోపాన్ని తెలుపుతుంది. అందువల్ల వీటిలో సాంకేతిక అర్దాలు సిద్దించవు. ఈ దోషాలు మనకు నివాసయోగ్యం కానీ గృహాలు గురించి చెపుతాయి. ఇవి  కనీస ఇంగితజ్ఞానంతో ముడి పడివున్నాయి. 

కిటికీలు లేని గృహం (అంధక వేధ): తొలి నాటి గృహాలలో కిటికీలు ఉండేవికాదు. ఆ తరువాత గావాక్షాల పేరుతో చాలా ఎత్తులో చిన్న గూళ్ళు ఏర్పాటు చేసేవారు. దిశలకూ అనుగుణంగా కిటికీలు లేని గృహం (కాణ వేధ), దిశలకూ అభిముఖంగా ద్వారాలు లేని గృహం (వికట వేధ), సరైన ప్రమాణాలలో ద్వారాలు,కిటికీలు లేని గృహం (కుబ్జ వేధ), ప్రమాణాలకు మించి ద్వారాలు, కిటికీలు ఉన్న గృహం(దిగ్రుక్త వేధ), నేల మట్టంలో ద్వారం ఉన్న గృహం (బధిర వేధ),  వాస్తు పద విన్యాసాన్ని అనుసరించి కట్టని గృహం (రుధిర వేధ), తగిన ఎత్తు లేని గృహం (చిపిట వేధ), అందవిహీనమయిన గృహం (వ్యంగజ వేధ), మధ్య భాగం కంటే పక్క భాగాలు ఎత్తుగా కట్టిన గృహం (మురజ వేధ), ప్రక్క భాగాలు లేని గృహం(కంక వేధ), చూరు లేని గృహం (కుటిల వేధ), స్తంభాలు లేని గృహం (శంఖపాల వేధ), నాగలి వలె వంపు ఉన్న గృహం (కైంకర వేధ) ఇలాంటి దోషాలు గృహ నిర్మాణంలో రాకూడదని చెప్పారు. పెద్దగా వివరణ అవసరంలేని ఈ విషయాలను హేతుబద్దమైనవిగా భావించటంలో తప్పేముంది?

ఒకవేళ ఇలాంటి దోషాలతో ఉన్న గృహాలు నిర్మిస్తే ఒక్కో దానికి ఒక్కో ఫలితం వస్తుందని చెబుతూ రకరకాల  రోగాలు, భయాలు, బాధలు ప్రాప్తిస్తాయని చెప్పారు. ఇవి సహేతుకం కావని వాటిని దోషాలను నియత్రించటానికే చెప్పారని తెలుసుకొంటే వాస్తు నమ్మకాలు గాలికెగిరి పోతాయి. అంతేకాని ఫలితాల పేరుతో అందంగా అల్లిన అబద్దాలను  రుజువు చేయాలని కోరటం వివేకవంతులు చేయవలిసిన పని కాదు. (సశేషం)

ఆచార్య కొడాలి శ్రీనివాస్ 

Comments

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర 

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు ది