Skip to main content

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 2

ఏదైనా ఒక విషయం పై మనస్సులో ఒక నిశ్చితాభిప్రాయం ఏర్పడితే దానికి గురించిన విషయ పరిశీలనలో మరొకరి అభిప్రాయాలను పట్టించుకోరు. ఇలాంటి వారు తాము పట్టిన కుందేటికి మూడేకాళ్లు అంటూ ముందుగా  ఏర్పరుచుకున్న ఇనుప చట్రం లో దాన్ని బిగించి గిరగిరా తిప్పి చాకిరేవులో ఉతికి ఆరవేయటం నైజం. నిక్షపాక్షిక పరిశీలన లోపిస్తే నిజాలు మరుగున పడతాయి. ఇది రావిపూడి వారి వాస్తువు శాస్త్రమా? లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.


భూతాలు - దిక్కులు  

వాస్తును అర్ధం చేసుకోవటానికి పాఠకులకు దానిలో ఉన్న పదాలను ముందుగా పరిచయం చేయటం పరిశోధనా గ్రంథాలలో తప్పని సరి అంశం. వాస్తువు గ్రంథ రూపంలో వచ్చేటప్పటికి (క్రీ.శ. 4-5 శతాబ్దాలు) పంచ భూతాలు మాత్రమే వారికి తెలుసు. చార్వాకులు నాలుగు భూతాలు అన్నారు, ఆధునిక విజ్ఞానం ప్రకారం ఇవి ఏవి మూలకాలు కాదని చెప్పారని అంటూ రావిపూడి వారు అసలు విషయాన్ని ప్రక్కకు తీసుకువెళ్లడం వారి అసహనాన్ని మాత్రమే తెల్పుతుంది. అలాగే దిక్కులు, దిక్పాలకుల గురించి. ఆనాటి వారికి ఒక ప్రదేశాన్ని నాలుగు ప్రధాన దిక్కులతో నాలుగు విదిక్కులతో విభజించటమే తెలుసు. భూమిని 360 డిగ్రీల కోణంలో, ఒకడిగ్రీ మరల 60 నిమిషాలుగా, ఒక నిమిషం 60 సెకండ్లగా విభాగించే జ్ఞానం అప్పట్లో లేదు. ఇంత చిన్న విషయానికి దిక్కులు ఎనిమిదే ఎందుకుండాలి ఇంకా ఎక్కువ ఎందుకుండరాదో అని అడగటంలో అర్ధం లేదు. మీరు అన్నట్లు రోదసీలోకి పోతే దిక్కులే ఉండవు. దిక్కులే లేకపోతే గోళాకారపు భూమికి వాస్తు ఎలా వర్తిస్తుంది అనేది  కేవలం వితండ వాదన.  నేల విడిచి సాము చేయటం లాంటిది. ఎందుకంటే వాస్తులో చెప్పబడిన దిక్కులు భూమిపై ఉన్న ప్రదేశానికి సంభంధించినివి కదా!  ఒక ప్రదేశానికి ముందు-వెనుకలు, కుడి - ఎడమలు చెప్పటానికి వారికి దిశలు ఉపయోగపడటం తప్పు ఎలా అవుతుంది. అవి లేకుండా ప్రదేశం యొక్క స్థితిగతులు సులభంగా చెప్పలేము.  

ఒక ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించటానికి దిశలు ప్రాధాన్యం వహిస్తాయనేది నిర్వవాదాంశం. కచ్చితమైన తూర్పు దిశను లేదా ఉత్తర దిశను భూమిపై గుర్తించే పద్దతి దిక్సాధన పేరుతో ఆనాటి వాస్తు గ్రంధాలలో లిఖితమై ఉంది. వాటిని బట్టి ప్రణాళికా బద్ధంగా గ్రామ, నగర, పట్టణ, ఆలయాల  నిర్మాణాలు చేశారు. అనేక రకాల గ్రామ, నగర ప్రణాళికలు వీటిలో ఉన్నాయి. ఆనాటి వారు తూర్పు దిశను ప్రధానంగా చేసుకొని సవ్య దిశలో (clockwise) ప్రణాళికలు చేసుకున్నారు. ప్రణాళికలో వాళ్ళు అన్ని దిశలకూ సమాన విలువ ఇచ్చారు. మీరు అన్నట్లు దిశలలో ఒకటి ఎక్కువ మరోటి తక్కువ కాదు. కానీ సూర్యోదయం బట్టి తూర్పుకు, సూర్యగమనం (ఉత్తరాయణం) బట్టి ఉత్తరానికి మతాచారాల కారణముగా కాస్త ఎక్కువ  ప్రాముఖ్యత వచ్చింది. రావిపూడి గారు ఓనన్నా కాదన్నా ప్రతి దిశకు ప్రకృతి సిద్ధంగా ఒక నిర్దిష్టమైన స్థానం ఉంటుంది. మానవుని సహజ ఇంగితజ్ఞానం ప్రకృతికి అనుగుణంగానే పయనిస్తుంది. ప్రకృతిని ఆరాధించే క్రమంలో పురుడు పోసుకున్నవే ఈ దిక్పాలకులు. ఆదిమ మానవుల ఊహల్లో పుట్టిన ఈ దిక్పాలకులు తమ దైవిక శక్తితో మన జీవితాలను శాసిస్తారని తలచటం అవివేకం. దిశల వెనుక దాగిన మౌఢ్యాన్ని కేవలం గుర్తిస్తే చాలదు. అది మౌఢ్యం అయినప్పటికీ ఇంకా వాస్తురూపంలో (సమాజంలో) ఎందుకు నిలిచిపోయిందో వివరించగలగాలి. అప్పుడే వీటి నుండి విముక్తి లభిస్తుంది. అదే నా ప్రయత్నం.      

వాస్తుపద మండలం 

నిర్మాణాలు చేయవలిసిన ప్రదేశాన్ని మన గ్రాఫ్ షీట్ లో గడులు (Gird) వలె వారు వాస్తుపద మండలాల పేరుతో చిన్నచిన్న గదులుగా విభజించేవారు. వాటిలో నిర్మాణాలకు రూపకల్పన చేశారు. ఈ గదులను సులభంగా గుర్తించటానికి వేదకాలం నాటి ఆర్యులు ఆరాధించిన 45 మంది దేవతల పేర్లు పెట్టారు. చివరివరకు నిర్మాణాల ప్రణాళికల రూపురేఖలు చెదరకుండా వాస్తు పద మండలంలో సరి చూసుకున్నారు. కాలాన్ని కాల పురుషుడుగా అన్నట్లే వాస్తుపద మండలాన్ని వాస్తు పురుషుడు ఆక్రమించి ఉంటాడు. వీటి వెనుక మార్మికత కొంత ఉన్నా వాటితో కొన్ని నిర్దిష్ట ప్రయోజనాలు (ప్రణాళికలో) ఉన్నాయని నా రచనలో చెప్పటం రావిపూడి వారికి "గాడిద గుడ్డు" లా కనపడటంలో ఓచిత్యం ఏమిటో మన మట్టి బుర్రలకి తట్టదు. బహుశా ఆ వాస్తుపద మండలంలో ఉన్న పదాలకు నేటి మాట్రిక్సి లా x,y అని కాకుండా వారు ద్వేషించే దేవతల పేర్లు ఉండటమేమో తెలియదు.

నా రచనలో ఇవన్నీ ఎందుకు ప్రస్తావించానంటే నిజంగా వాస్తులో ఏముందో తీసుకోవాలనుకునే జిజ్ఞాసులకు నా పరిశోధనాంశాలు తెలియజేయాలనే ఉద్దేశమే కానీ వాస్తుబలాలు/ఫలాలు చెప్పటానికి కాదు. 

వాస్తులో ప్రస్తావించిన ఋగ్వేద కాలంనాటి ముక్కు మొఖం తెలియని  దేవతలకు (వాస్తుపద దేవతలు 45 మంది, బాహ్యపద దేవతలు 8 మందితో పాటు వాస్తు పురుషుడు కలిసి మొత్తం 54 మంది) మహిమలు ఆపాదిస్తూ, వాస్తు సూత్రాల అనుగుణంగా కట్టడాలు కట్టిన సుఖసౌఖ్యాలు, కట్టనందువల్ల కష్టనష్టాలు వస్తాయనేది ఫలిత వాస్తుగా చెప్పుతూ వచ్చారు.

ఇలా ఉద్బవించిన వాస్తు ఫలితాలు తప్పు అని అవి జరగవని ప్రయోగాత్మకంగా రుజువు చేయమని రోజూ కుహనా సిద్ధాంతులను అడగవలిసిన అగత్యం లేదు.  ఇలాంటి విశ్వాసాలు వాస్తు శాస్త్రంలో ఎందుకు పుట్టాయో, వాటి వెనుకనున్న మర్మమేమిటో అర్ధం చేసుకోగలిగితే వాటిపై ఉన్న విశ్వాసానికి పునాది లేకుండా పోతుంది. ఇది ఒక్క వాస్తు విశ్వాసాలకు మాత్రమే పరిమితం కాదు ఇలాంటి మూఢవిస్వాశాలన్నిటికి వర్తిస్తుంది. (సశేషం)   

ఆచార్య కొడాలి శ్రీనివాస్ 

Comments

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర 

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు ది