Skip to main content

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష-1

ప్రముఖ హేతువాది శ్రీ రావిపూడి వెంకటాద్రి గారి రచన 'వాస్తువు శాస్త్రమా ?' పై 2001 లో నేను రాసిన ఈ సమీక్ష నాచే రచింపబడిన 'వాస్తులో ఏముంది?' మరియు 'వాస్తులో వాస్తవాలు' అనే పుస్తకాలపై వారు చేసిన విమర్శకు వివరణ ఇవ్వటమే కాకుండా వాస్తు శాస్త్రాన్ని సరైన కోణంలో అవగాహన చేసుకోవటానికి, ఉపకరిస్తుంది భావిస్తున్నాను. 

తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావని అన్నట్లే హేతువాదం పేరుతో గ్రంథ రచయిత చెప్పినవన్నీ వాస్తవాలు కావు. హేతువాది పత్రికలో 'వాస్తులో వాస్తవమెంత?' అనే శీర్షిక పేరుతో ప్రఫుల్ల చంద్ర గారు రాసిన వ్యాసాలను భూమికగా  చేసుకొని వాస్తుపై పెద్ద పుస్తకం రాయాలనే కుతితో ఈ పుస్తకాన్ని రాసినట్లు రావిపూడి గారు ముందుమాటలో చెప్పుకున్నారు. అలాగే పుస్తకానికి 'వాస్తులో వాస్తవమెంత?' అనే పేరు పెడితే వాస్తులో 'వాస్తవం' ఎంతో కొంత ఉంటుందేమోనని శంకతో దీనికి వాస్తువు శాస్త్రమా? అనే పేరు పెట్టారట. ఆహా ఏమి హేతువాదం? ఒక విషయం పై ముందే ఒక స్థిర నిర్ణయానికి వచ్చి తన వాదం నెగ్గటానికి వితండవాదం చేయటం వారికే చెల్లు. వాస్తు అనేది శాస్త్రం కాదు, కాదు, కానేకాదు అనే ఒక ముక్క నొక్కి గట్టిగా చెప్పటానికి 152 పేజీలు మాత్రమే ఖరాబు చేశారట. దీనిపై ఇంకా విస్తృత్తంగా రాయవచ్చు కానీ అనవసరపు కాగితం ఖర్చుఅని ఇంతటితో ముగింపు ఇచ్చారట. వాస్తు అనేది శాస్త్రం కాదు అనే ముక్క చెప్పటానికి ఒక చిన్న కరపత్రం సరిపోయేదానికి వీరికి పుస్తకం రాయాలన్నా కోరికెందుకో! బహు గ్రంథ కర్తగా ఉండాలనే తపనతో ఏ విషయం పైనైనా ఎడా పెడా సంక్షిప్త రచన కొనసాగించ వచ్చు. కానీ తనకు పరిచయం లేని నిర్మాణ, సాంకేతిక విషయాలపై హేతువాదం పేరుతో అవాక్కులు చెవాకులు చెప్పటం రావిపూడి గారి ఈ  రచనలో స్పష్టంగా కనిపిస్తుంది. 
వాస్తువు శాస్త్రమా, కాదా అనే విషయంలో ఈనాడు విభిన్న వాదనలున్నాయి. నిజానికి వాస్తు అంటే నివాసగృహం/ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది లేదా పరి రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే మన ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రంగా చెప్పుకోవచ్చు. క్రోడీకరించిన సూత్రాలను తూచా తప్పక ఆచరించటమే ఆనాటి శాస్త్ర లక్షణం. అయితే నేడు శాస్త్రం అనే పదాన్ని విజ్ఞాన శాస్త్రం (సైన్సు) కు పర్యాపదంగా వాడుతున్నారు.
వాస్తువు శాస్త్రమా? అనే విషయంలో పెళ్ళికి,పిడుగుకు ఒకటే మంత్రం అన్న చందనా రావిపూడి వారి రాతలు ఉన్నాయి. ఆనాటి వాస్తుకి నేటి సైన్సు పరిధిలో ఎంత విలువ ఉంది ? సైన్సుకు వున్నా లక్షణాలు దీనికి వున్నాయా ? అనే విషయంలో పూర్వాపరాలు పరిశీలించాలి. ఒక నాడు వాస్తు విద్యగా, వాస్తు శిల్ప కళగా పిలవబడి వాస్తు శాస్త్రంగా స్థిరపడి చలనం కోల్పోయిన తీరును తెలుసుకోవాలి. వాస్తులో చెప్పబడిన అంశాలను సాంకేతిక విషయాలుగా, సామాజిక విషయాలుగా,  సాధారణ విషయాలుగా వేరుచేసి వాటిలోని తప్పుఒప్పులు పరిశీలించుకోవాలి. వాస్తులో చెప్పబడిన మంచి,చెడు ఫలితాలలో ఆశలు, భయాలు జోడించింది కేవలం  వాస్తు సూత్రాలు ప్రజలు తుచ తప్పకుండా ఆచరించటానికి మాత్రమే. ఆనాటి సమాజంలో సామూహికంగా అమలు జేయటానికి చేప్పబడిన వీటిని చూసి భయాందోళనలు చెందనవసరం లేదని నా రచనలలో చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. పూర్తి ఆధారసహితంగా పరిశోధించి, సాంకేతికంగా పరిశీలించి రాసిన నా రచనలపై వారి విమర్శలో శాస్త్రీయత కానీ సహేతుకత కానీ కన్పించదు. 
రావిపూడి గారి ఆలోచనలన్నీ కేవలం ఫలిత వాస్తు చుట్టూ పరిభ్రమిస్తూ వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని మూలాన్ని వదిలి  తుది తీర్పు చెప్పారు. అర్ధ సత్యాలను మూఢంగా నమ్మేవారు హేతువాదులు ఎలా అవుతారు ?

ఇంజనీరింగ్ - వాస్తువు

వాస్తులో ఏముంది? అనే గ్రంధంలో నేను  ఇంజినీరింగు తో వాస్తుకు లంకె పెట్టటం తాత మోకాటికి - అవ్వ బోడితలకి ముడివేసినట్లున్నదని రావిపూడి గారు వాపోయారు, పరిణామక్రమంలో ఆదిమ మానవుడు గుహల నుండి గృహాలలోకి మారిన విషయంలో గుప్తజ్ఞానం ఏమీ లేదుకదా. సంచార జీవనం నుండి స్థిర నివాసాలు  ఏర్పరుచుకునే  క్రమంలో గ్రామ, నగర, పట్టణాలుగా జనావాసాలు ఏర్పరటం, బాటలు, పేటలు, కోటలు, ఇళ్ళు, గుళ్ళు, గోపురాలు వచ్చాయి. క్రమ బద్దమైన జనావాసాల కొరకు రూపొందించుకున్న నిర్మాణ శాస్త్రమే ఈ వాస్తు శాస్త్రం అని ఒప్పుకోవటానికి వీరికి వచ్చిన అడ్డంకి ఏమిటో తెలియదు. కానీ మరొక చోట " మన దేశంలోని నిర్మాణ శాస్త్రంలో వాస్తువు పేరుతో మార్మికత చొరబడింది " అని అంటూ అష్టదిక్పాలకులు. వాస్తు పురుషుడు, గ్రహ  నక్షత్రాలు, దిశాఫలాలు వాస్తువు పేరుతో చొరబడటం వల్ల నిర్మాణ శాస్త్రం ఎటు పోయిందో అంటూ సన్నాయి రాగం అందుకున్నారు. ప్రామాణిక వాస్తు మూల గ్రంధాలను వదిలి మూస గ్రంధాలను మాత్రమే చదివితే వచ్చే తంటా ఇదే. ఇలా గంద్రగోళపడే వారిని దృష్టిలో ఉంచుకొనే జ్యోతిష్య సంబంధ అంశాలను తొలగించి శుద్ధ గృహ నిర్మాణ విషయాలను మాత్రమే ఆ పుస్తకంలో చర్చించాను. జ్యోతిష్యం గురించి నా అభిప్రాయాలు ఇక్కడ అప్రస్తుతం అని చెప్పలేదు. జ్యోతిష్యం శాస్త్రమని చెప్పలేదు కాబట్టి వాస్తువు  శాస్త్రం ఎలా అవుతుందని వీరి ప్రశ్న.  
వాస్తును జ్యోతిష్యం కళ్ల జోడుతో చూసే వారికి వాస్తులో జ్యోతిష్యం మాత్రమే కనిపిస్తుందిగాని నిర్మాణ శాస్త్రం కనబడదు. 
దేవుడు, మతం రెండు మూఢ విశ్వాసాలు అని నేను అంగీకరించలేదని ఏక పక్షముగా భావిస్తూ అందువల్ల వాస్తువును నిర్మాణశాస్త్రంతో ముడి వేయటానికి వారధి నిర్మించటానికి ప్రయత్నించానట. ఇది  అతకని టంకం అని రావిపూడి గారి హేతుబద్ధ వాదన. వీరి వాదన ఇంకా ఇలా కొసాగించారు  
నిర్మాణ శాస్త్రానికి  వాస్తువు కు  ముడి వేశారు-  ఇది తప్పు 
జ్యోతిష్యానికి వాస్తుకు ముడివేశారు- ఇది తప్పు 
జ్యోతిష్యం శాస్త్రం కాదు కాబట్టి వాస్తువు శాస్త్రం కాదని సిద్ధాంతీకరించారు. 
నిర్మాణ శాస్త్రం  వాస్తువు వేరు వేరనే వీరి నిశ్ఛత అభిప్రాయం.  వీరు ఇలా భ్రమ పడటానికి కేవలం వీరి జ్ఞానం చౌక బారు మూస వాస్తు పుస్తకాలకే పరిమితం అవటమే. ఆ జ్ఞానంతో వాస్తుకి జ్యోతిష్యానికి టంకం పెట్టి ముడి వేశారు కానీ అది అతకలేదు (సశేషం)
ఆచార్య కొడాలి శ్రీనివాస్  
 

Comments

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర 

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు ది