మోసం అనేది చాలీచాలని దుప్పటి వంటిది. తల కప్పుకుందామంటే కాళ్ళు, కాళ్ళు కప్పుకుందామంటే తల కనపడుతుంది. అమాయక రైతులను మోసం చేయటానికి, ఆలోచనాపరుల నుండి మద్దతు రాకుండా చేయటానికి అమరావతి పై సాంకేతిక విషయాలలో అయోమయాన్ని సృష్టించారు.
1. అమరావతిలో నేలలకు పటుత్వం తక్కువ అని, భారీ భవన నిర్మాణాలకు పనికి రాదని అంటూనే పునాదులకు ఖర్చు ఎక్కువ అని దుష్ప్రచారం చేశారు. సహజంగా నల్లరేగడి భూములకు పటుత్వం తక్కువగానే ఉంటుంది. సాధారణంగా ఇది ఒక చ.మీ కు 15 టన్నుల బేరింగ్ కెపాసిటి ఉంటుంది. ఎక్కడైనా అధిక అంతస్థుల భవన నిర్మాణంలలో పునాదులు లోతులోనే ఉంటాయి. అయితే అమరావతిలో భూమిలోపల ఆరు మీటర్ల లో దృఢమైన రాతి పలక ఉండటం చేత అది నిర్మాణాలకు అత్యంత అనుకూలంగా ఉందనేది వాస్తవం. పటుత్వం ఎక్కువ ఉన్న రాతినేలలు, గులక నేలలు ఉన్న చోట్ల పునాదులకు బ్లాస్టింగ్ ఖర్చు, రవాణా ఖర్చు ఎక్కువ. వీటితో పోల్చి చూస్తే అమరావతిలో పునాదులు అయ్యే వ్యయం ఒక చదరపు అడుగుకు షుమారుగా 200 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవదు. అమరావతికి ఉన్న ఇతర ప్రయోజనాలతో పోలిస్తే ఇది చాలా స్వల్ప మైనది. పునాదులకు ఎక్కువ ఖర్చు అనుకుంటే సాధారణ గృహాలను, 5 లేక 6 అంతస్థుల భవనాలకు పరిమితం కావచ్చు. అమరావతిలో ఉన్న 29 గ్రామాలలో సాధారణ పునాదితోనే అక్కడివారు రెండు,మూడు అంతస్థుల ఇళ్ళు కట్టుకున్నారన్న సంగతి గుర్తించాలి. అలాగే ప్రసిద్ధి చెందిన సాంకేతిక సంస్థలు (SRM, VIT, AMRUTHA) తమ విద్యా సంస్థలకు చెందిన బహుళ అంతస్థుల భవనాలను ఇదే నేలపై నిర్మించారు. పునాదులు ఖర్చు అనుకునేవారు భవనాన్ని జీవితంలో కట్టలేరు. పునాదులనేవి అది భూమి వినియోగం బట్టి, నిడివిని బట్టి, విశాలతను బట్టి ,రూపకల్పన బట్టి సాంకేతిక నిపుణులు నిర్ణయిస్తారు. దృఢమైన పునాదులపై నిర్మించే కట్టడమైన, సమాజమైన స్థిరంగా ఉంటుందన్నది తెలిసిందేకదా. నిజానికి రాష్ట్ర ప్రభుత్వ భవనాలు మొత్తం పదికి మించవు. వీటిలో దాదాపు అన్నిటికి దృఢమైన పునాదులు వేయటం జరిగింది. ఇప్పుడు వాటి పునాదులకు పెట్టిన ఖర్చు గురించి ఆలోచించటం విజ్ఞత కాదు. పునాదులకు అయ్యే వ్యయం పోతే పైన కట్టే నిర్మాణం అయ్యే ఖర్చు ఇక్కడ అయినా ఇచ్చాపురం అయినా ఇడుపులపాయ అయినా ఒకటే అని విజ్ఞులందరికి తెలిసిందే.
2. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి
అమరావతి నగరానికి ఆర్థిక స్వాలంబన దాని రూపకల్పనలోనే ఉంది. అమరావతిలో రైతులనుండి సేకరించిన 34 వేల ఎకరాల భూమిలో వారికి కేటాయించిన భూమి పోగా ఇంకా ప్రభుత్వం వద్ద మిగిలే భూమి 8,039 ఎకరాలు. దీనిలో ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధికి కేటాయించిన భూమి కేవలం 3,019 ఎకరాలు. (తక్కువలో తక్కువ రాజధానికి 3,000 ఎకరాలు సరిపోతాయన్న విషయంలో విపక్షాలలోకూడా ఏకాభిప్రాయం ఉంది) ప్రస్తుత రాజధాని అవసరాలకు పోను భవిష్యత్ అవసరాల కోసం అమరావతిలో ఉంచిన మిగులు భూమి షుమారు 5 వేల ఎకరాలు. ఈ భూమి విలువ షుమారు రూ. లక్ష కోట్లు. నగరం అభివృద్ధి చెందాక భవిష్యత్తులో ఇది రూ.2లక్షల కోట్లకు పైగా పెరుగుతుంది. రాజధాని లో మౌలిక వసతులు, ఇతర ప్రజా ప్రయోజకరమైన నిర్మాణాలు పూర్తిగా ఈ భూములు అమ్మగా వచ్చిన డబ్బుతోనే నిర్మించేవిధంగా నిపుణులు ప్రణాళిక చేశారన్నా విషయం గమనార్హం.
అమరావతి అన్నివిధాలా అభివృద్ధి చెందిన తరువాత ఇక్కడ నుండి వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి తరతరాలుగా ఉపయోగించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి కచ్చితంగా ఒక ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఒక నగరం ఉండవలిసిన ఆవశ్యకతను ఆర్థిక నిపుణులందరు గుర్తించారు. ఎందుకనేది గమనిస్తే పశ్చిమ బెంగాల్ వార్షిక ఆదాయంలో కోల్ కత్తా నుంచే 76%, తెలంగాణ ఆదాయంలో హైదరాబాద్ నుంచే 60%, ఒడిశా ఆదాయంలో భువనేశ్వర్ నుంచే 56%, కర్ణాటక ఆదాయంలో బెంగుళూరు నుంచే 40%, తమిళనాడు ఆదాయంలో చెన్నై నుంచే 39% వరకు వస్తున్న విషయం తెలిసిందే.
అమరావతి పై నగరాల స్థితికి చేరటానికి కొంత సమయం పట్టవచ్చు. మన దగ్గర ఉన్న వనరులను బట్టి దీనిపై పెట్టుబడి పెట్టవచ్చు. అంతే కానీ భవిషత్ ప్రణాళిక అసలు వద్దుఅని ఈ పూటకు పబ్బం గడిస్తే చాలానే వారు,పప్పు బెల్లాల కొరకు అర్రులు చాచే వాళ్ళు అమరావతి ప్రణాలికను అవవేళన చేస్తున్నారు. సాంకేతిక, ఆర్థిక, సామాజక అభివృద్ధి పై అవగాహాన లేని లేకి కుంచిత ఆలోచనాపరులు రాద్ధాంతం చేస్తున్నారు. వీరి వాదనలలో ఒకదానికి మరొకదానికి పొంతన కుదరదు. అబద్దాలను కట్టిపెట్టి అవగాహన పెంచుకొని అమరావతి నిర్మాణానికి సహకరించండి.
సశేషం--- ఆచార్య కొడాలి శ్రీనివాస్
Comments