సమస్యలు చుట్టుముట్టినపుడు , అజ్ఞానం రాజ్యమేలుతున్నప్పుడు మేధావుల మౌనం సమాజానికి చేటు చేస్తుంది. మంచి ఎదో చెడు ఎదో తెలియజేయవలిసిన బాధ్యత ఉంటుంది. సమస్యను పరిష్కారం చేయలేనప్పుదు దాన్ని గజిబిజి చేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టే పరిపాలకులకు దశా దిశా నిర్దేశం చూపించాలి. తెలుగు వారి క్షేమం,అభివృద్ధి కోరేవారు అమరావతి రాజధానిపై స్పందించాలి.
1. మంచికో చెడుకో అమరావతిలో నూతన రాజధాని ఉండాలని స్థూలంగా అన్ని పక్షాలు ఒప్పుకున్నాయి. ప్రణాళికలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాప్రదేశం ఎంపికలో ఏకాభిప్రాయం ఉంది. దేశ నలుమూలల నుండి పవిత్ర జలాలు, పుట్ట మన్ను తెచ్చి ప్రదేశాన్ని శుద్ధి పరిచి, పెద్దలందరి సమక్షంలో ప్రధాని స్వహస్తాలతో అమరావతికి శంఖు స్థాపన చేశారు. రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు, ప్రజా ఆమోదంతో మొదలు పెట్టిన పనికి అందరు నిబద్దతతో కట్టుబడి ఉండాలి. అంత్య నిష్టురం కన్నా ఆది నిష్టురం మేలు అని ఆనాడు అంగీకరించి మౌనంగా ఉన్న వ్యక్తులు ఈనాడు ఆక్షేపించటం సరికాదు.
2. రైతుల నుండి సమీకరించబడ్డ భూమిని తిరిగి యధాస్థితికి తెచ్చి వారికి ఇవ్వటం ఇప్పుడు అసాధ్యం. రైతులకు వచ్చిన స్థలాలు కొన్ని అమ్మకాలు కూడా జరిగాయి. కొంత భూమిలో ఇప్పటికే చాలా భవనాలు నిర్మించారు. తాత్కాలిక పాలనా సౌలభ్యం కొరకు వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం, రాష్ట్ర శాసన సభ, శాసన మండలికి 6 లక్షల చదరపు అడుగుల తో ఆరు శాశ్విత భవనాలు నిర్మించారు. భవనాలు తరువాత ఇతర అవసరాలకు వినియోగించే ఉద్దేశంతో వీటిని నిర్మించారన్న విషయం తెలిసికూడా అసత్యలు వ్యాప్తి చేసే వారి ఉద్దేశం గ్రహించండి. అలాగే వీటి నిర్మాణానికి అయినా ఖర్చు చదరపు అడుగు Rs 3350/- మాత్రమే. వీటి ఖర్చు పై చేసే వాదనలలో వాస్తవాలు లేవు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కొరకు విలువైన 850 ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు కూడా అమరావతిలో స్థలాలు ఇచ్చారన్న విషయం మననం చేసుకోవాలి.
అమరావతిలో ఇల్లు ఉండాలని భావిస్తూ ప్రపంచ వ్యాప్తంగా 1250 మంది తెలుగువారు హ్యాపీ నెస్ట్ లో అపార్ట్ మెంట్స్ కొరకు ముందస్తు చెల్లింపులు చేశారు. అలాగే 500 కోట్లతో కట్టే NRIT భవనంకు ప్రణాళిక రూపొందించి నిర్మాణం కొరకు వేచి ఉంది. వీరందరికి ఏమి సమాధానం చెబుతారు.
3. నేలపాడులో రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం కొరకు రెండు లక్షల ఇరువది వేల చదరపు అడుగుల తో (జి+2) భవనం నిర్మించారు. 160 కోట్ల రూపాయలతో పటిష్టంగా నిర్మించిన ఈ భవనం కూడా శాశ్విత భవనమే. రాజసం ఉట్టిపడేలా అద్భుతంగా రూపకల్పన చేసి పునాది స్థాయిలో నిర్మాణంలో ఉన్న హైకోర్టు భవనం పూర్తి అయినా తరువాత ఇది నగర న్యాయాలయంగా సేవలందిస్తుంది. న్యాయమూర్తుల నివాసాలు నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది.
4.ప్రఖ్యాత చెందిన మూడు విశ్వ విద్యాలయాలలో VIT, SRM. రెండు నిర్మాణాలు పూర్తి చేసుకొని తరగతులను కూడా ప్రారంభిచాయి.
శాసన సభ్యులకు, ఉన్నత అధికారులకు, సెక్రెటియేట్ ఉద్యోగులకు నివాసాలు దాదాపు పూర్తి కావచ్చాయి. అంతర్గత రహదారుల నిర్మాణం మొదలైంది.
5. తిరుమల దేవస్థానం వారిచే ఆగమ శాస్త్ర రీతిలో 135 కోట్లతో నిర్మించే అద్భుతమైన శ్రీ వారి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగి నిర్మాణం మొదలైంది. దాన్ని కుదించి 35 కోట్లతో సాధారణ దేవాలయ స్థితికి మార్చటం దైవ ద్రోహం.

5.యాభై పైగా కేంద్ర రంగ సంస్థలతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలకు వారి అవసరాల కొరకు భూకేటాయింపులు జరిగాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే అమరావతికి ఒక రూపు సంతరించుకుంటుంది. ఎందరికో ఉపాధి కలుగుతుంది.
అమరావతి మొదటి దశ నిర్మాణానికి దాదాపు 50 వేల కోట్లు అవుతాయి అన్నది ఒక అంచన, ఇప్పటికే 40 వేల కోట్లకు పనులకు టెండర్లు ఇచ్చారు, దాదాపు తొమ్మిది వేల కోట్లు ఖర్చు అయింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1500 కోట్లు, అమరావతి బాండ్లు పేర షేర్ మార్కెట్లో తెచ్చిన 2000 కోట్లు కూడా ఉన్నాయి. మిగిలిన పెట్టుబడికి ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. పెట్టుబడి దారులలో విశ్వసనీయతను పోగొట్టేలా విశ్వసనీయతకు మారుపేరుగా చెలామణి అయ్యేవారు ప్రవర్తించటం శోచనీయం.
వివేకం లోపించినవారు, విచక్షణ లేనివారు, లోపాయికారి ఆలోచనతో చేసే అరాచక, అహంకారపూరిత పనులకు అడ్డుకట్ట వేయాలి. అమరావతి నగర నిర్మాణాన్నిఅర్దఅంతరంగా ఆపివేయాలనే పిచ్చి నిర్ణయాన్ని వదిలివేయాలని ప్రభుత్వంపై వత్తిడి తేవాలి. ప్రజల మనోగతికి విరుద్ధంగా రాజధాని కమిటీ వేయటం తాగనిపని. అభిప్రాయ సేకరణ పేరుతో శర వేగంగా సాగుతున్న అమరావతి నిర్మాణానికి సైన్ధవులుగా అడ్డపడే వారిని చరిత్ర క్షమించదు. స్వలాభంతో, అసూయ ద్వేషాలతో అమరావతిని అడ్డుకొంటే జాతి ద్రోహులుగా నిలిచిపోతారు. పంతాలు,పగలు వదిలి రాజకీయ విజ్ఞతను చూపండి.
విద్య,విజ్ఞాన, వినోద ,వికాసాలతో అజరామమై అద్వితీయమైన ఆర్థిక ప్రగతితో, ఆంధ్రులందరికి వైభవ చిహ్నం గా ప్రజా రాజధానిగా మన అమరావతి విలసిల్లుతుందని ఆశిస్తూ ... ఆచార్య కొడాలి శ్రీనివాస్
Comments