Skip to main content

అమరావతి - ఆవశ్యకత - 5

ఆవేశం ఆలోచనను అణిచివేస్తుంది. అభిమాన దురాభిమానాలు వివేకాన్ని, విచక్షణను పోగొడతాయి. కక్షలు,కార్పణ్యాలు జాతిని దహించివేస్తాయి. ఈర్షా ద్వేషాలు, పగ ప్రగతికి ప్రతిబంధకాలుగా మారతాయి. అనుమానాలు, అపనమ్మకాలు అభివృద్ధికి ఆటంకం కల్పిస్తాయి. వ్యక్తిగతంగానే కాక సామాజకపరంగాకూడా వీటిని దరిచేయకుండా విజ్ఞతను చూపాలి. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పురుడు పోసుకుంటున్న క్రమంలోవస్తున్న సంకుచిత వాదనలలో ఇటువంటి పోకడలే కనిపిస్తున్నాయి. వాటిని కూడా పరిశీలించి వాస్తవాలు తెలుసుకుందాం. 

1. కర్నూలు లో హైకోర్టు 

ఒకనాడు తెలుగుజాతి అంతా ఐక్యంగా ఉండాలని,దానికొరకు రాజధానిని రెండుసార్లు త్యాగం చేసిన కోస్తా ఆంధ్రులు నేడు రాజధాని తమ ప్రాంతంలో ఉండాలనుకోవటం న్యాయబద్ధమైన కోరిక. రాజధానిలోనే హైకోర్టు ఉండాలనే భావనతో 1956లో గుంటూరులో ఉన్న హైకోర్టు హైదారాబాద్ పోయింది. ఆనాడు రాజధాని ఒకచోట, హైకోర్టు మరొక చోట ఉండాలన్న వాదన సరికాదని, రాజధానిలో హైకోర్టు అంతర్భాగమని శ్రీభాగ్ ఒప్పందం చేసుకొన్నా అదే పెద్ద మనుషులు భావించటం, గుంటూరులో ఉన్న హైకోర్టు తిన్నగా హైదరాబాదు చేరటం చారిత్రిక వాస్తవం. ఏనాడో కాలగర్భంలో కలిసిపోయిన శ్రీభాగ్ ఒప్పందాన్ని ఇప్పుడు తిరగతోడుతూ అనవసర ఆందోళనలు చేయటం సమంజసం కాదు. నిజానికి ఆ ఒప్పందం నాటి కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు కుదుర్చుకుంది. చట్టబద్ధంకాని ఈ ఒప్పందాన్ని ఆనాడే ప్రతిపక్షాలు వెతిరేకించితే ఒకే ఒక్క ఓటు మెజారిటీతో రాజధాని కర్నూలులో పెట్టారు. గతించిన చరిత్రను ఇప్పుడు వల్లించినా ప్రయోజనం శూన్యం. పరస్పర అంగీకారంతో 1937లో చేసుకొన్న శ్రీబాగ్ ఒప్పందం 1956లోఆంధ్ర ప్రదేశ్ అవతరణతో రద్దు అయింది. అయినా శ్రీబాగ్ ఒప్పందం అంటూ విభజన రాగం ఎత్తుతున్నారు. మూడు అడుగులు ముందుకు వేస్తే ఏడు అడుగులు వెనక్కు నెట్టే వాళ్ళు దాపురించారు.
హైకోర్టు సంబందించిన వాస్తవ పరిస్థులును పరిగణలోకి తీసుకుంటే ఈనాడు మన రాష్ట్ర పరిధిలో అపరిష్కృతంగా ఉన్న కేసులలో 70 శాతం పైగా కోస్తా ఆంద్రకు సంబంధించినవే. వీటిలోకూడా సివిల్ కేసులు రాయలసీమ జిల్లాల వారికంటే ఎక్కువ. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొనే న్యాయ వివాదాలు, ప్రజాప్రయోజన దావాలు అదనం. అలాగే ఉత్తరాంధ్ర వాసులకు హైకోర్టు అమరావతిలో ఉంటేనే అందుబాటులో ఉంటుంది. కాబట్టి అత్యధిక ప్రజల, ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో చూస్తే హైకోర్టు అనేది రాజధాని అమరావతిలో ఉండటం సమంజసం మరియు సహేతుకం. ప్రజాభిష్టం కాదని హైకోర్టును కర్నూలుకు తరలించటం కచ్చితంగా అప్రజాస్వామిక చర్య. రాష్ట్ర ప్రభుత్వంపై శాశ్వితంగా అదనపు ఆర్థిక భారం మోపే అనాలోచిత నిర్ణయమే అవుతుంది. 

న్యాయం కొరకు హైకోర్టు కు వెళ్లిరావటానికి దూరాభారంగా భావించే కక్షిదారుల సౌలభ్యం కొరకు కర్నూలు, విశాఖ పట్నం లలో ప్రాంతీయ హైకోర్టు బెంచిలను ఏర్పాటు చేయటంలో అభ్యంతరాలు ఉండవు. ఇది ప్రజలకు సత్వర న్యాయం పొందటానికి ఉపకరించే సమంజసమైన కోరిక. 

2. ప్రాంతీయ అసమానతలు - సీమ వాదనలు 

మన రాష్త్ర భౌగోళిక పరిస్థితులను బట్టి కోస్తా ఆంధ్రా కంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలో కొంత భాగం అభివృద్ధిలో వెనుకంజలో ఉన్నాయనుటలో సందేహం లేదు. తీవ్ర వర్షాభావం, నీటి ఎద్దడి, వర్గ కలహాలు రాయలసీమను కృంగదీస్తే, అవిద్య,పేదరికం ఉత్తరాంధ్ర వెనుకబడటానికి హేతువులగా కనిపిస్తున్నాయి. 

విద్యాపరంగా పరిశీలించితే విద్యాసంస్థలలో సింహ భాగం రాయల సీమ నాలుగు జిల్లాల లోనే ఉన్నాయన్నది నిజం. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, అపార ఖనిజ నిక్షేపాలు, సారవంతమైన భూములు ఉండికూడా సీమ వెనక బడటానికి కారణాలు అన్వేషించాల్సిన ఆవశ్యకత ఉంది. రోగం ఒకటి అయితే మందు ఇంకోటి అన్న చందాన రాయలసీమలో రాజకీయ క్రీడ నడుస్తున్నది.

కోస్తా ప్రాంతంలో ఉన్న విద్య,ఆర్థిక,రాజకీయ,సామాజిక సమతుల్యత సీమలో లోపించిందన్నది కఠోర వాస్తవం. ఈ ప్రాంతం పాలెగాళ్ళ పాలన నుండి నయా రాజకీయ పెత్తందారీ వ్యవస్థలోకి మారిందే కానీ ప్రగతి పథంలోకి పయనించలేదు. 

తొలినుండి విద్య,ఉద్యోగ విషయాలలో దామాషాపద్ధతిలో వారికి సమాన అవకాశాలు లభించాయి. రాష్ట్ర రెవిన్యూలో వారి వాటాకు మించి అనుభవిస్తున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా కీలక పదవులలో ఆ ప్రాంతం వారే ఎక్కువ కాలం పాలించారు. అయినా జీవన ప్రమాణాలు పెరిగి ఆర్థిక స్వాలంబన జరగేలేదంటే అక్కడివారి ఆలోచనా దృక్పధంలో దోషం ఉన్నదన్నమాట. ఉదాహరణకు హైకోర్టు విషయమే తీసుకుందాం. అది కర్నూలులో ఉన్నంత మాత్రాన ప్రత్యేకంగా రాయసీమ వాసులకు వనగూడే ప్రయోజనాలు ఏముంటాయి? మహా అయితే ఓ డజను మంది న్యాయమూర్తులు, వందమంది ఉద్యోగులు, రెండు మూడు వందల మంది లాయర్లుకు, గుమస్తాలకు పని వస్తుంది. కేసు ఓడినవాడు కోర్టులో ఏడిస్తే, గెలిచినవాడు ఇంట్లో ఏడుస్తాడు అనే నానుడి తెలిసిందే. హైకోర్టు దగ్గరే ఉందికదా అని కింది కోర్టులో ఓడినవారు పంతాలకు పోయి కేసులు వదలక హైకోర్టు చుట్టూ తిరిగి ఇల్లు వళ్ళు గుల్లచేసుకుంటారు. 

అలాగే హైకోర్టు కర్నూలు లో ఉంటే చిత్తూరు, హిందూపూరు, కడప వాళ్లకు కొత్తగా వరిగేది ఏముంది? దానికంటే రాయసీమలో అన్ని ప్రాంతాల వారికి కావాలినది త్రాగునీళ్లు ,సాగు నీళ్లు, ఉపాధి కల్పించే పరిశ్రమలు. వాటికొరకు గొంతులెత్తాలి. గుత్తాధిపత్యం రూపుమాపాలి.

రాయల సీమలో కూడా పెట్టుబడి దారులు, ధనవంతులు, వ్యాపారస్తులు, విద్యావంతులు తగినంత మంది ఉన్నారు. అక్కడి పెట్టుబడులు పెట్టి స్థానికంగా అభివృదికి తోడ్పాటు అందించాలి, కానీ వారా పని చేయుట లేదు. కారణం కక్షలు కార్పణ్యాలకు దూరంగా చెన్నై, హైదరాబాదు, బెంగళూరు వంటి నగరాలకు పోయి పరిశ్రమలు పెట్టి స్థిరపడ్డారు. ఈ స్థితిలో మార్పు తేగలిగితే అభివృద్ధి వస్తుంది. వాస్తవాలు ఇలాఉంటే రాజకీయ పెత్తనం చలాయించటానికి అనుక్షణం ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టి బ్లాక్ మెయిల్ రాజకీయం చేయటం అక్కడ పరిపాటి అయింది. ఇంచుమించు ఇదే తంతు 1937 లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం నాటి నుండి 80 సంవత్సరాలుగా గమనిస్తూనే ఉన్నాం. అలాగే కోస్తాఆంధ్ర ప్రాంతం నుండి రాష్ట్రానికి రెవిన్యూ మిగులు వస్తుంటే రాయసీమ మొదటినుండి రెవిన్యూ లోటుతో ఉందన్న సంగతి మదిలో ఉంచుకోవాలి. తెగేదాకా త్రాడు లాగటం విజ్ఞత కాదు.

తెలుగువారి విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కలసి ఉంటే కలదు సుఖం అని కోస్తా ఆంధ్రులు ఆలోచించారు. ఆనాడు ఉమ్మడి మద్రాసునుండి విడిపోయి ప్రత్యేక ఆంద్ర రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కానీ, భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలంగాణాతో కలిసి ఆంద్రప్రదేశ్ గా అవతరించినపుడు గాని సంతోషంతో ఉప్పొంగిపోయారు. తొలినుండి సోదరభావంతో పెద్దఅన్నగా సీమ క్షేమానికి,అభివృద్ధికి శ్రాయశక్తులా తోడ్పడిన ప్రాంతంపై అకారణ ద్వేషం, అంతులేని శత్రుత్వం, విషం చిమ్ముతూ ఉద్యమాలు నడపటం, కష్టనష్టాలలో తోడుండిన తెలుగువారిని విశ్వసింప పోవటం, కులాల మధ్య, ప్రాంతాల మధ్య కుంపట్లు రగిల్చి దానిలో చలి కాచుకోవటం సరైన మార్గం కాదు. దీనిపై రాయసీమ మేధావులు స్పందించాలి. రాయల సీమ అభివృద్ధికి ఈ ప్రాంత వాసులు ఎప్పుడు వెతిరేకం కాదు. నైతకంగా ఎటువంటి హక్కు లేకున్నా ఇక్కడ లభించే కృష్ణ గోదావరి జలాలను మానవత్వంతో సీమకు అందించే పథకాలకు స్వాగతిస్తున్నాం.

స్వయం జనిత ఆర్థిక ప్రణాళికతో పైసా పెట్టుబడి లేకుండా రెండు లక్షల కోట్ల సంపదను సమకూర్చే అమరావతి నిర్మాణంకు ఆక్షేపణ చెప్పేముందు కేవలం సీమకు నీళ్లు ఇవ్వటానికి లక్ష కోట్ల అప్పుతో ప్రణాళిక చేయటం ఎంత వరకు సబబో ఆలోచించాలి. పెట్టుబడికి, ఆదాయానికి పొంతన లేని పొల్లు మాటలతో కష్టాలు తీరిపోవు, కడుపులు నిండవు. 


నవ్యఆంధ్ర లో అందరికి ఉపయోగపడే ప్రజా రాజధాని అమరావతి. కృష్ణ పెన్నా నదుల అనుసంధానానికి ఉపయోగపడే బహుళార్థక సాధకం పోలవరం ప్రాజెక్టు. మన ప్రాణ నాడి అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతి ఒక్కరు కుల, మత,వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి. వాటి ద్వారా పొందే ప్రతి ఫలాలూ ఇక్కడి వారితోపాటు రాష్ట్రమంతా పదికాలాలపాటు పొందుతారు. (సశేషం) 

- ఆచార్య కొడాలి శ్రీనివాస్

Comments

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు ది

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర