నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి రూపుదిద్దుకునే శుభతరుణంలో కొంతమంది సంకుచిత వాదనలతో కుల, ప్రాంత భేదాలను రేపుతూ ప్రమాదకర రాజకీయ క్రీడను మొదలుపెట్టటం గర్హనీయం. పసలేని పనిమాలిన ఆ వాదనలు పరిశీలించి వాస్తవాలు తెలుసుకుందాం.
1. రాజధాని విస్తీర్ణం ఎక్కువా?
రాజధానికి అంత భూమి ఎందుకు? కేవలం 13 జిల్లాల నవ్యంధ్రకు 35 వేల ఎకరాల తో పెద్ద రాజధాని కావాలా?
ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ మరియు కొన్ని ముఖ్యమైన ఆఫీసులు తప్ప రాజధానికి ఇంకేం ఉంటాయి ?
దానికొరకు ప్రజలకు తిండి పెట్టె పచ్చని పంట భూములు పణంగా పెట్టాలా? ఇత్యాది కుటిల ప్రశ్నలతో అమరావతిని కుంగదీస్తున్న వారు వాస్తవాలు గ్రహించాలి.
అమరావతి కేవలం అవశేష 13 జిల్లాలకు మాత్రమే రాజధాని కాదండి. ఇది 5 కోట్ల ఆంధ్రుల హృదయస్పందన అనే స్పృహ ఉండాలి. ఆంధ్రుల ఆత్మ గౌరవానికి, అభున్యతికి, వైభవానికి ఒక అపురూప జనపధం గా పరిగణించాలి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులకు, తెలుగు భాషకు చిరునామా అన్న విషయం గుర్తుంచుకోవాలి. ప్రణాళికాబద్ధంగా పురుడుపోసుకుంటున్న ఈ నగరం రాబోయే రోజులలో కావలిసిన అవసరాలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుగా సమీకరించ బడినది. లబ్దిదారులైన రైతులకు, ప్రజాఅవసరాలైన రహదారులు, సామాజిక భవనాలు , ఉద్యానవనాలు వంటి వాటికి పోను నికరంగా మిగిలేది 7లేక 8 వేల ఎకరాలు మాత్రమే. దీనిని పెట్టుబడిగా పెట్టి దానితో ఈ నగరాన్ని నిర్మిస్తారు. అంత ఎందుకు
అలాగే రాజధాని అంటే అసంబ్లీ హాలు, సెక్రటేరియట్ ... మాత్రమే అనటం హాస్యాస్పదం. ఈ వాదన చేసే వారు ముందుగా రాష్ట్రం -విధులు, నగరం- విస్తరణ, పట్టణ ప్రణాళిక వంటి విషయాలు తెలుసుకోవాలి. రాజధాని అన్నతరువాత ఎన్నో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉంటాయి. వీటన్నిటికీ వసతి చూపాలి. చులకన చూపుతో తెలిసి తెలియని జ్ఞానంతో వ్యాఖ్యానం చేయటం మంచిది కాదు.
అమరావతి మరో ముంబాయి, కొలకొత్త, హైదరాబాద్, చెన్నై వంటి అస్తవ్యస్త మహా నగరాలుగా మారకూడదనే ముందు చూపుతో సరైన పట్టణ ప్రణాళికతో రూపొందించుతున్న ఈ అమరావతికి వీలైతే మంచి సలహాలు ఇవ్వండి. రాజధాని నగరం అన్నతరువాత అక్కడ నివసించేవారికి కావలిసిన సౌకర్యాలు అనేకం ఉంటాయి. వైద్య అవసరాలకు కావసిసిన అన్ని వసతులను ఒకేచోట ఉంచటం, ఆ ప్రదేశాన్ని వైద్య నగరం అనటం, రాష్ట్ర హై కోర్ట్ , న్యాయమూర్తులకు, న్యాయవాదులకు కావలిసిన వశాత్తు ఆన్నీ ఒకచోట ఉండేలా ఒక జోన్ , అదే న్యాయ నగరం అనటం, పరిపాలనకు సంబందించిన కార్యాలయాలు ఉండే జోన్ ను ఒక నగరం గా, నగర వాసులకు కావలిసిన విద్యా సంస్థలకు ఒక జోన్ , వినోదాలకు ఒక జోన్, పర్యావరణ హిత పరిశ్రమలకు ఒక జోన్ వంటి నవ నగరాల ( వీటినే మనం పేట/ కాలనీ అని అంటాం) నవ నగరాల అన్నంత మాత్రాన అవి ప్రత్యేక తొమ్మిది నగరాలు కావు.
ఇకపోతే రాజధాని కొరకు పంటలు పండే పచ్చని పంట పొలాలు బలి పెట్టాలా అన్నారు. నిజానికి అక్కడ సేకరణ చేసే భూమిలో దాదాపు 70 శాతం సాధారణమైన మెట్ట భూమి అని, వాటిలో కొన్నికొండవీటి వాగు వరద ముంపు చేలు అని తెలుసుకొని వ్యాఖ్యానిస్తే బాగుండేది.పంట పండించే రైతులు ధర లేక చాలా ప్రాంతాలలో వరి పండించటం మానిన సంగతి తెలిస్తే ఇలాంటి స్వార్ద వాదుల తిండికి డోకా లేదన్న విషయం అర్ధం అవుతుంది. అలాగే ఇక్కడ సేకరించిన భూమి రాష్ట్రం లో సాగులో ఉన్న భూమిలో 0.01 శాతం మాత్రమే. ప్రకాశం బ్యారేజ్ తో సాగుచేసే దానిలో కూడా ఒక శాతం మాత్రమే. ఇక్కడ భూములలో సాగు బదులు ఇదే బకింగ్ హం కాలువ కింద నీరు అందని పొలాలు రెట్టింపు పరిణామంలో కాలువ చివర ప్రకాశం జిల్లాలో ఉన్నాయన్న విషయం గమనార్హం. గుంటూరు ఛానల్ విస్తరించి ప్రకాశం జిల్లా పర్చూరు వరకు పొడిగించితే మరో 50 వేల ఎకరాలు సాగుచేయవచ్చు.
అలాగే రైతులు - రైతు కూలీలు తరతరాలుగా అలాగే బ్రతకాలనటం మానవత్వం అనిపించుకోదు. ఇప్పటికే చాలా మంది రైతులు వ్యవసాయం వదిలి ఇతర వ్యపకాలలోకి వెళ్ళారు.రైతు కూలిలె కౌలు రైతులుగా మారి పంటలు పండించి, వాటికి గిట్టుబాటు ధర రాక కొండకచో ఆత్మహత్యలకు పాల్పడుచున్న వైనం మనం ఎరిగినిదే. సరుకు లభ్యత ఎక్కువ ఉంటె ధర తక్కువ ఉంటుందన్న వ్యాపార సూత్రం అర్ధం అయితే పంట పొలాలు పోతున్నాయన్న ఏడుపు రాదు.
అలాగే రైతు కులీల విషయం లో కూడా ఆందోళన అనవసరం. నూతన రాజధానిలో వీరికి మరింత మెరుగైన ఉపాధి లభిస్తుంది. పూర్వం వాషింగ్ మెషిన్స కొత్తగా వచ్చినప్పుడు బట్టలు ఉతికే వారికి ఉపాధి ఎట్లా అని ఆందోళన చేసిన వారున్నారు. ఇంకా నూలు మిల్లులు, ట్రాక్టర్స, ప్రోక్లేన్లు వంటి ఆధునిక పరికరాలు వచ్చినపుడు కుడా ఇలాంటి వాదనలే వినిపించాయి.
2. వరద ముప్పు ఉందా?
కృష్ణకు గరిష్టంగా వరద వస్తే రాజధాని మునిగి పోతుంది అన్న వాదన సత్యదూరం. 2009లో వచ్చిన గరిష్ట వరద పరిమాణమే 11 లక్షల కుసెక్కులు, అప్పుడే ఈ ప్రాంతం మునగలేదు.గత 120 ఏళ్ల ప్రవాహాన్ని పరిశీలించితే నది సరాసరి వచ్చిన వరద 78 వేల కుసెక్కులు మాత్రమే. అయితే స్థానిక వర్షాలతో కొద్ధి ప్రదేశాలలో కొండవీటి వాగు ఎగదన్ని ముంపు వస్తుంది. దానికి నివారణగా వాగును విస్తరించి వరద నీటిని తోడిపోయటానికి 220 కోట్ల తో ఒక ఎత్తిపోతల పధకం గత ప్రభుత్వం 2017లోనే నిర్మించారు.
వర్షపు నీరు మళ్లించే మార్గాలు లేక ఈనాడు చిన్న చితకా వర్షాలకే మహా నగరాలన్నీరోజుల తరబడి నీట మునుగుతున్న విషయం తెలిసిందే. మురుగునీటి కాలవలో వర్షపునీరు కూడా పోవటమే దీనికి కారణం. అయితే అమరావతిలో ముగునీటికి, వర్షపునీటికి ప్రత్యేక మార్గాలు ఉన్నాయి. పర్యావరణాన్ని కాపాడుతూ, వరద నీటిని సద్వినియోగం చేసే ప్రణాళిక అమరావతిలో ఉంది. అందుకే దీన్ని హరిత-నీలి (Green-Blue City) నగరంగా పిలుస్తున్నాం.

3. నిర్మాణాలకు ఖర్చు ఎక్కువా?
అమరావతి లో భూమి నల్లరేగడి అని, పునాదులు చాలా ఖర్చు అనే వాదం కూడా సత్య దూరమే. భవనాన్ని బట్టి పునాదులు ఉంటాయి. అమరావతిలో కొన్ని ప్రదేశాలలో భూధారణ శక్తి తక్కువగాను కొన్ని చోట్ల ఎక్కువగాను ఉంది. తక్కువగా ఉన్న చోటనే పరిగణలో తీసుకొని లెక్కించితే ఇది మొత్తం ఖర్చులో 4 శాతం కంటే ఎక్కువ కాదు. అనంతారం వంటి ప్రదేశాలలో గట్టి ఎర్ర మట్టి నేల ఉంది. ప్రభుత్వము నిర్మించే భవనాలు చాలా తక్కువ కాబట్టి పునాదులు పెట్టె డబ్బు చాలా స్వల్పం. అమరావతి లో కలిగే ప్రయోజనాలతో పోలిస్తే ఇది ఇసుకరేణువంత. సాంకేతక విషయాలలో సాధారణ తర్కం పనిచేయదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి.
4. వికేంద్రీకరణ అవసరమా?
అభివృద్ధి వికేద్రీకరణ అంటే రాజధాని వికేద్రీకరణ అనే తలా తోక లేని వాదనలు చేసే పండితమన్యులు దాపురించారు. రామజధాని అనేది అవిభాజ్య ఏకస్వరూప నగరమన్న విషయం గ్రహించాలి . పరిశ్రమలు, విద్యాలయాలు వంటివి దేనికదే ప్రతి ఒకటి ఒక యూనిట్. వీటిని పంచవచ్చు. అంతేకాని ఒక విశ్వ విద్యాలయాన్ని విభజించి లైబ్రరరీ ఒకచోట, ప్రయోగశాలలు మొరొక చోట, క్రీడాస్థలం ఇంకోచోటా . తరగతుల గదులు, పరిపాలన భవనము ఒకచోట పెట్టటం ఎంత హాస్యాస్పదమో రాజధాని వికేద్రీకరణ కూడా అంతే. రోజువారీ పని సౌలభ్యం , వివిధ విభాగాల మధ్య పరస్పర సహకారం, ప్రజలకు సత్వర సేవలు , ఆర్డక భారం పడకుండా ప్రభుత్వానికి అన్నిటి పై నియంత్రణ ఉండాలంటే వికేద్రీకరణ పనికి రాదు. అలాగే రాజధానికి అనుబంధం ఉన్న అన్నితరగతుల ప్రజలు అక్కడే నివాసం ఉండాలి. లేకపోతే రాజధాని రాత్రి పూట నిర్మానుష్యంగా, నిర్జీవంగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే అక్కడ నివసించే వారికి కావలిసిన వసతులన్నీ అక్కడే సమకూర్చాలి. ఇదే మన అమరావతిలో అనుసరించిన సిద్ధాంతం.
ఈ సందర్భంగా చరిత్రలో జరిగిన ఒక తప్పిదం గురించి ప్రస్తావిస్తాను. ఆస్ట్రేలియా లో 100 ఏళ్ల క్రితం రాజదాని ఎక్కడ ఉండాలి అనే విషయంలో తీవ్ర విభేదాలు పొడచూపాయి. మెల్బోర్న లో ఉండాలి అని ఒక వర్గం, సిడ్నీ లో ఉండాలని ఒక వర్గం పంతాలకు పోయి మధ్యేమార్గంగా వాటి రెంటి మధ్య నిర్మానుష్య ఖాళీ ప్రదేశం అయినా కాన్బెర్రా లో కట్టారు . వంద ఏళ్ళు అయినా ఇప్పటికి అక్కడ పెద్దగా ఎవ్వరు నివాసం ఉండరు. ప్రజాప్రతినిధులతో సహా అక్కడ పనిచేసేవారు సిడ్నీలో గాని మెల్బోర్న్ లోగాని నివాసం ఉంటారు. వారికి నివాస ,ప్రయాణ భత్యాలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. మరో వంద ఏళ్ళు అయినా ఈ పరిష్టితులలో మారు వస్తుందని ఆశించలేము. అనివార్య పరిస్థితులు వాళ్ళ ఈ అనవసరపు ఖర్చును భరింస్తున్నారు.
ఇదే స్థితిని దయచేసి మన నవ రాజధానికి తేకండి. దగాపడి ఆర్డక ఇబ్బందులలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను సొంత కాళ్ళపై నిలబెట్టటానికి జరుగుతన్న ప్రయత్నంలో అవతరించిన అమరావతిని స్వాగతించండి. మన ప్రగతికి అడ్డుతగులుతున్న ఇలాంటి తిరోగమన వాదనలను వదలి పెట్టండి. లేదా చరిత్రహీనులుగా మారతారు. (సశేషం)
- ఆచార్య కొడాలి శ్రీనివాస్
Comments