పేరులో ఏముంది? అనేవారు కొందరైతే పేరులోనే ఉన్నది పెన్నిది అనేవారు మరికొందరు. ప్రపంచం ఆశ్చర్యపడేలా ఆంధ్రులకు అద్భుత రాజధాని కావాలని కాంక్షించే వారికి దానికి తగిన పేరు కుడా ఉన్నతంగా ఉండాలని ఉబలాటపడటం సహజమే.
మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు దూరదృష్టితో నవ్యాంధ్ర రాజధానికి అమరావతి అని పేరు పెట్టటం అన్ని విదాల ఆమోదయోగ్యమైన నిర్ణయం.
అమరావతి అంటే అజరామరమైన నగరం. మన పురాణేతిహాసాల్లో దేవేంద్రుని రాజధానిగా అభివర్ణింపబడిన నగరం. క్రీస్తు పూర్వమే భరతఖండంలో సువిశాల సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన నగరం. శ్రీముఖ శాతకర్ణి నుంచి యజ్ఞశ్రీ శాతకర్ణి వరకు 4 శతాబ్దాలు అప్రతిహతంగా గాంధారం నుంచి కృష్ణాతీరం వరకు విస్తరించిన సామ్రాజ్యానికి రాజధాని నగరం. గౌతమ బుద్ధుని పాదస్పర్శతో పునీతమైన నగరం. ఆచార్య నాగార్జునుని వంటి అనేకమంది పండితుల తాత్విక శాస్త్ర చర్చోపచర్చలతో మార్మోగిన నగరం. సనాతన, బౌద్ధ ధర్మాలు రెండింటికీ సమానంగా ఆలవాలమై విలసిల్లిన నగరం. మన ప్రజల గత వైభవాన్ని చాటి చెప్పే అమరావతి నామాన్ని మన నూతన రాజధానికి పెట్టుకుని చరిత్ర నుంచి స్ఫూర్తి పొందుతూ అత్యంత అధునాతన ప్రజా రాజధాని నగరంగా తీర్చిదిద్దుకోవాలని మంత్రిమండలి ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఎప్పుడో 2000 ఏళ్ల క్రితమే ఆంధ్రుల రాజధానిగా విలసిల్లిన ధాన్యకటకం (ధరణికోట) ఆ తరువాత అమరావతిగా ప్రపంచ ప్రసిద్ది చెందినది. ఈ పట్టణం పేరు తిరిగి స్పురించేలా నేడు మరల నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి అవతరించటం శుభపరిణామం. తాత పేరు మనుమడికి పెట్టె సాంప్రదాయం మన తెలుగునాట సర్వ సాదారణ విషయమే. తాత పేరు, కీర్తి నిలబెట్టాలనే లక్ష్యంతో ఈ వరవడి కొనసాగుతుంది. కొత్త అమరావతి గత కీర్తులను అధికమించాలనే అందరి ఆకాంక్ష.

బౌద్ధం, జైనం, శైవం వంటి భిన్న మతాల, సంస్కృతులకు కాణాచిగా పేరొందిన అమరావతి కృష్ణా నదీ తీర ప్రాంతంలో నేడు నూతనంగా నిర్మించబోయే తుళ్ళూరుకు అతి సమీపాన ఉంది.
మౌర్య చక్రవర్తుల కాలంలో ఇక్కడ బౌద్ధస్థూపాన్ని నిర్మించారు. ఇది దేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం. విశ్వ కీర్తి గడించిన ఈ బౌద్ద ఆరామాల వల్ల ఇది అమరావతి గా పిలవబడింది.
నేడు అమరావతి అమరేశ్వరునిగా కొలువందుకుంటున్న స్వామి ఆనాడు ధరణికోట అమరేశ్వరస్వామిగా వెలుగొందుతున్నాడని ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. ఇది పంచారామాలలో ఒకటిగా పుణ్య క్షేత్రంగా వాసికెక్కినది. పురాణాలలో దేవతలకు రాజధాని అమరావతి అని వర్ణించబడినది.
![]() |
Raja Vaasireddy Venkataadri Nayudu (1783-1816) |
శాతవాహునల నుండి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వరకు ఎందరో పాలకులకు రాజధానిగా, ఆచార్య నాగార్జునుడు నుండి శాంతి దూత దలైలామా వరకు ఎందరికో ఆద్యాత్మక విద్యాకేంద్రంగా విలసిల్లిన నేల ఇది. మొదటి కాల చక్రకు ఆతిధ్యం ఇచ్చిన ప్రదేశం . గౌతమ బుద్దుడు నడయాడిన కర్మ భూమి ఇది. ఇక్కడ అవిర్బవించిన అమరావతి శిల్పం అద్బుతం.
గతాన్ని గుర్తు చేసే ఈ అమరావతి ఘన చరిత్ర మన వర్తమానానికి బాటలు వేస్తుంది. దశ, దిశ నిర్దేశిస్తుంది.
నవ్యాంధ్ర రాజధానిగా పునురుత్తేజం పొందుతున్న అమరావతి నగరం ఆధునిక ఆంధ్రుల నాగరిక వికాసానికి, వైభవానికి, పౌరషానికి సజీవ సాక్ష్యంగా, ఆంధ్రుల ఘనచరిత్రను, విజయగాథను, శాస్త్ర, సాంకేతికరంగాల్లో సాధించిన కీర్తిని, తాత్విక చింతనలో కనబరచిన గాఢతను ప్రతిబింబింపచేలా కలకాలం వర్దిల్లాలని ఆశిద్దాం.
Comments