Skip to main content

రాజధాని - నగర వాస్తు -2

నవ్యాంద్ర రాజధాని నగర నిర్మాణం లో స్థల ఎంపిక గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి కొన్ని విషయాలు దీనిలో పరిశీలించుదాం.
 
ఆంధ్రులకి చాల పురాతన ఘనచరిత్ర ఉంది. ధాన్యకటకం (అమరావతి) నుండి హంపీ విజనగరం వరకు ఎన్నోసార్లు రాజధానులు నిర్మించుకున్న నైపుణ్యం, శక్తి, యుక్తి కలిగిన జాతి. ఆనాటి మన రాజధానులు వాస్తు శాస్త్రం లో ఉన్న సూత్రాలకు అనుగుణంగా నిర్మించబడ్డాయి అనుటలో సందేహం లేదు.
 
వాస్తు తో పాటు చరిత్రను కుడా పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం లో అర్ద శాస్త్రం రాసిన ఆచార్య చాణక్యుడు కూడా రాజధాని నగరం ఎక్కడ ,ఎలా ఉండాలో స్పష్టం గా చెప్పాడు. 
రాజధానిగా ఉండే ప్రదేశం దేశానికి మధ్య భాగంలో శ్రేష్టము మరియు సారవంతమైన భూమి అయి ఉండాలి. అది నాలుగు వర్ణాల వాళ్ళ జీవనానికి అనుకూలంగా ఉండాలి. ఆ ప్రదేశం నదీసంగమం దగ్గర కానీ , ఎప్పటికి ఎండని జలాశయం వద్ద గాని (సహజ సిద్దమైనది లేదా మానవ నిర్మితం కాని ) ఉండాలి. దాన్ని నగర నిర్మాణ వేత్తలు మంచిదని చూచించినచో ఆప్రదేశంలో దేశస్థానీయాన్ని( మహా నగరాన్ని) నిర్మించాలి. 
అది వాస్తువశం చే (ప్రదేశాన్ని బట్టి) వృత్తాకారంలో కాని చతురస్రాకారం లో కాని దీర్ఘ చతురస్రాకారం (ఆయతాకారం) లో కాని ఉండవచ్చు అని చాణుక్యుడు సాదారణ సూత్రీకరణ చేస్తే మత్స్య పురాణం లో నదీతీరంలో నిర్మించే రాజధాని అర్ధ చంద్రాకారంలో ఉండటం ప్రశస్తం అంటుంది. 

అలాగే అక్కడ ఉన్న భూమి దేవమాత్రుకం (వర్షాధార/మెట్ట భూమి) కాకుండా నదీ మాత్రుకం (మాగాణి) గా ఉండాలి అని, ఇంకా అది పలు పుష్ప, ఫలోఫేతమై కడు రమ్యంగా ఉండాలి. అచ్చట ఉన్న జనులు అనురక్తులుగా వారిలో అత్యధికులు వ్యవసాయం, వ్యాపారం చేసే కర్మకారులుగా (శ్రమజీవులు) ఉండాలి అని చెబుతుంది. 

రాజాధాని నగరానికి కుడి వైపున జల ప్రవాహం ఉండాలి. అంటే తూర్పు దిశకు నగరం ఉంటె జలప్రవాహం దక్షణం లో ఉత్తరంగా ఉంటె తూర్పున, పడమర దిశ లో ఉంటె జలప్రవాహం ఉత్తరంలో, దక్షిణ దిశకు ఉంటె పడమర దిశలో ప్రవాహం ఉండాలి అని కౌటిల్లుని ఉవాచ. 

ఇది తూర్పు,ఉత్తర దిశలలో మాత్రమే ప్రవాహం ఉండాలనే ఈనాటి కొత్త వాస్తు ప్రవక్తలకు మింగుడు పడని విషయం. అలాగే మురుగు నీరు పోయే మార్గం ఎడమ ప్రక్కన ఉండాలి. 
పుర మధ్యలో దేవాలయాలు, విపణి వీధులు (వ్యాపార ప్రదేశాలు) తో పాటు వివిధ ప్రదేశాలలో వైద్యశాలలు, ధాన్యాగారాలు, ఉద్యానవనాలు, యంత్ర శాలలు (కర్మాగారాలు), అగ్ని శాలలు నిర్దేశించిన ప్రదేశాలలో ఉండాలి. 
ఉత్తర లేక తూర్పు దిశలలో శ్మశాన ప్రదేశాలు ఏర్పాటు చేయాలి అని చెబుతూ శూద్రులకు, మిగతావారికి దక్షిణ దిశలో ఉండాలని శాసించాడు. 


నగరంలో తూర్పు - పడమరలకు మూడు, ఉత్తర-దక్షిణాలకు మూడు ప్రధాన వీధులు (రహదారులు) ఉండాలి అని చాణక్యుడి అభిప్రాయం అయితే, మిగిలిన వాస్తు గ్రంధాలలో తూర్పు - పడమరలకు ఎనిమిది, ఉత్తర-దక్షిణాలకు ఎనిమిది ప్రధాన వీధులు (రహదారులు) తో పాటు నగరం చుట్టూ వృత్తాకార మార్గం (మంగళా వీధి- Outer Ring Road) తోమొత్తం 17 ప్రధాన వీదులు ఉండాలి అని చెప్పబడినది. 

మంగళా వీధి- Outer Ring Road 

సమరాంగణ సూత్రధార లో 15 వీధులు తూర్పుకు మరి 15 వీధులు ఉత్తరం కు ఉండి నగరం చుట్టూ మంగళా వీధి ఉండాలని వీటికి ఇరుపక్కల పాదచారులు నడవటానికి జనాహ పదాలు (Foot Path) ఉండాలి అని చెప్పబడినది. ఇవి కాక రాజ వీధి తో పాటు ఉప వీధులు ఉంటాయి. 
వాస్తు పదవిన్యాసం చేయబడిన స్థలంలో వీధులన్ని ఒకదానికొకటి లంబకోణంలో ఉండి అవిచ్చన్నంగా మొదటి నుండి చివరిదాకా తిన్నగా ఉండాలి. 
ఈనాడు ప్రజలకు సౌకర్యంగా ఉండే 'కర్ణ వీధులు' (Diagonal roads) ఆనాడు శాస్త్రకారులు అంగికరించ లేదు. ఒక చివరి నుండి మరొక చివరకు దూరం తగ్గించటానికి ఇవి ఈనాటి నగరాలకు తప్పనిసరి. 
ప్రధాన మార్గాలు అన్ని 8 దండాలు (షుమారు 48 అడుగులు) ఉండాలి. మిగిలనవి 4 దండాలు (24అ ) ఉండాలి 
మన ప్రాచీన వాస్తు సిద్దాంత కర్తలు ఆనాడు నగర నిర్మాణం లో అనుసరించిన "పద విన్యాసం (Gird plan)" నే ఈనాటికి కొద్ది మార్పులతో నగర నిర్మాణంలో వాడుతున్నారు. 
కాబట్టి రాజధానికి ఎంచుకున్న ప్రదేశాన్ని పదవిన్యాసం (జోనులుగా/సెక్టారులు గా విభజన) చేసి స్థల కేటాయింపులు, రహదారుల రూపు రేఖలు జరిగిన తరువాత వాస్తు పాత్ర దాదాపు పూర్తి అయినట్లే. 
పదవిన్యాసం లో నివాసానికి కేటాయించిన ప్రతి విభాగం కచ్చితంగా దిశలకు అనుగుణంగా నలు చదరం గా కాని ధీర్ఘ చదరం గాని (చదరంగం బోర్డు లో ఉండే గదుల వలె) ఉంటుంది. 
ఇవి 1x1, 2x2, 3x3, ....8x8 (64గడులు), 9x9(81గడులు), 10x10 (100 గదులు), ...... 32x32 (1024గడులు) ఇలా 32 విదాలుగా ఈ పదవిన్యాసం లో గడులుగా విభజిస్తారు. 
అయితే రాజధాని నగరానికి పద విన్యాసంలో 3364 గడులు (58x58) ఉండాలని విష్ణుధర్మోత్తర పురాణంలో ఉంది. 
ఈ పదాలలో ఎ ఒక్కభాగం ఈశాన్యము పెరిగాలా వంకరగా ఉండదు. ఈ విషయం ముఖ్యంగా స్థలానికి ఎంతోకొంత ఈశాన్యము పెరగాలని వాదించే వాళ్ళు తెలుసుకోవాలి. 
అలాగే వరాహమిహిరుడు 'బృహత్సంహిత' లో రాజధానిలో నివాసం ఉండే రాజు-రాణి, మంత్రి, సేనానుల ఇళ్ళు/ ప్రాసాదుల ప్రమాణాలు గురించి, వివిధ అధికారుల నివాస గృహాల కొలతలు వివరిచారు. విశ్వకర్మ ప్రకాశిక, మత్స్య పురాణం లలో కుడా ఇవే కొలతలు ఉన్నాయి. 
ఈ ప్రాచీన కొలతలేవి ఈనాటి నిర్మాణాలకు అన్వహించుకోవటం కుదిరే పని కాదు. పాత వాటి స్థానం లో నేటి అవసరాలకు తగిన ప్రమాణాలతో శాసన సభ/మండలి భవనం, సచివాలయం, రాజభవన్, హైకోర్టు, వివిధ కేంద్ర/రాష్ట్ర శాఖల ప్రధాన కార్యాలయాలు, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ,మండలి సభ్యుల నివాసాలు, న్యాయమూర్తులకు, ఉన్నత ఉద్యోగులకు కావలిసిన నివాసవసతులు కల్పించాలి. 

వీటితోపాటు ఇంకా విశ్రాంతి మందిరాలు, సత్రములు (ఆతిధ్య వసతులు) ఉద్యానవనాలు, వైద్యశాలలు, వ్యాయామశాలలు విద్యాలయాలు, వినోదకేంద్రాలు, విపణి కేంద్రాలు, వివాహ మంటపాలు వంటివి ఎన్నో కావాలి. వీటికి కావలిసిన విశాలమైన స్థలం అందుబాటులో ఉండాలి. 
వీటిని ఆర్కేటేక్టు/సివిల్ ఇంజనీర్స్ (నేటిస్థపతులు) లచే వారి కనుసన్నలలో ఆదునిక సాంకేతిక విజ్ఞానంతో నవ్యాంధ్ర రాజధాని అందంగా అద్బుతంగా , పదిలంగా, పటిష్టంగా, అందరికి అనుకూలంగా అధునాతనంగా అమర్చుకోవాలి.
వీటిశైలిలో తెలుగు వారి సంస్కృతి, కళలు, చరిత్ర, శౌర్య పరాక్రమాలు ఉట్టి పడేలా వైభవంగా రూపకల్పన చేయాలి. 
నగర ప్రణాళికలో రాబోయే 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. పెరిగే జనాభాను అంచనా వేసి తదనుగుణంగా నిర్మించాలి. 
ఇది కాలుష్య రహిత,పర్యావరణ హిత, హరిత ఆదర్శ ప్రజా రాజధాని మనది అని ఆంధ్రులు గర్వంగా చెప్పుకోవాలి. 

ఇలాంటి సుందర రాజధాని నిర్మాణాలలో పది పదిగొట్టు పదాలతో 'గృహ వాస్తు' అంటూ చేతిలో దిక్కుస్సూచి, మెడలో సంచి తగిలించుకుని వీధుల్లో తిరిగే గ్రామ సిద్దాన్తులకు/ అమాత్యులను అంటకాగే గ్రాస శిఖామనులకు, కుక్షింబరులుకు, గుడ్డిసన్నాసులకు విలువనిచ్చి వారి అభిప్రాయాలకు చోటు కల్పించాలనుకోవటం అజ్ఞానం. అన్ని వాస్తు శాస్త్ర గ్రంథాలలో నగర నిర్మాణ రూప శిల్పి' స్థపతి' కి ఉండవలిసిన కనీస అర్హతలు నిర్దేశించబడ్డాయి. 
సప్త వ్యసనాలు లేని సకల గుణ సంపన్నుడు, వాస్తు విద్యా ఔపోసకుడు, గణిత, ఖగోళ విద్యల తో పాటు వివిధ దేశ కాల మాన స్థితి గతులను తెలిసిన వాడై ఉండాలి. అద్బుతమైన ఉహా శక్తి గల మంచి చిత్రకారుడై ఉండాలి. వస్తు గుణ పరిశీలనలో నైపుణ్యం, నిర్మాణ కౌశల్యం ఉన్న వ్యక్తి అద్వర్యంలో రూపు దిద్దుకున్న నగరం ప్రజల ప్రశంసలు పొందుతుంది.
Prof. Kodali Srinivas

Comments

RAJEEV said…
దక్షిణ -పడమరా ప్లాట్ తిసుకోవచ్చ?

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర 

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు ది