ఆడంబరాలకు పోయి ప్రజల సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు చేసిన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇలాకాలో ఇదొక అంకం. దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టి (దానిలో వాస్తుకు ఖర్చు పెట్టింది దాదాపు కోటి ) 2006లో కట్టిన ముఖ్య మంత్రి క్యాంపు ఆఫీసుకు (లేక్ వ్యూ గెస్ట్ హౌస్) వాస్తు దోషం ఉందని,అందుకే ఆయన కు పావురాల గుట్టలో అర్దాంతపు చావు వచ్చిందని వాస్తు పండితుల ఉవాచ. (ఆనాడు వై.యస్.ఆర్. కు వాస్తు సలహాలు ఇచ్చిన వాస్తు విద్వాంసులు (విద్వంసులు) ఈ తాజావాస్తు రిపోర్టు చూసి ఏమంటారో!)
ఈ తాజా వాస్తు పోస్ట్ మార్టం రిపోర్ట్ను నమ్మి ఆ భవంతిలో ఉండటానికి భయపడి, మద్రాసు నుండి వాస్తు సిద్డంతిని పిలిపించారు శ్రీ రోశియ్య గారు. సదరు సిద్దాంతి సలహాలతో దానికి మరల వాస్తు మరమ్మతులు చేసారు. రిన్నోవేషణ్ పేరుతొ అరవై లక్షలు ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టారు.
వాస్తు హోమాలు, శాంతి పూజలు చేసి చివరికి 'కుడి కాలు' పెట్టారు. 'ఎడమ కాలు' మాత్రం అమీర్ పేటలో ఉన్న తన స్వంత భవనం లోనేనట. కేవలం కార్యాలయం మాత్రమే ఈ క్యాంపు ఆఫీసు నుండి నడిపిస్తారట.
అడ్డగోలుగా అన్ని లక్షలు పెట్టి వాస్తు రిపేరులు చేసిన తరువాత కుడా రోశియ్య గారికి ఇంకా వాస్తు భయం వదలక పోవటం ఆయన పిరికితనానికి ప్రత్యక్ష నిదర్శనం. మన దౌర్భాగ్యం.
ఒక వైపు రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందంటారు. ఆదాయం తగ్గిందంటారు. ఇలాంటి ఖర్చులకు మాత్రం నిధులు ఎలా ఊడి పడతాయో మరి! ఇదే రోశియ్య గారు ఆర్ధిక మంత్రి గా ఉన్నప్పుడు వాస్తు పేరుతొ ప్రభుత్వ భవనాలకు డబ్బు ఖర్చు చేయకుండా ఉండటానికి ఒక ఉత్తర్వు జారి చేసినట్టు గుర్తు. తనదాక వస్తేగాని తనువు బయట పదన్నట్లు, తనలో తిష్టవేసిన వాస్తు భయం పోగొట్టుకోవటానికి దాదాపు అరవై లక్షల ప్రజా ధనం తగలేసి మార్పు, చేర్పులు చేయించారు. అయినాకాని శంక పోలేదు.
ఈ వాస్తు గిలితో శ్రీమాన్ రోశియ్య గారు ఇంటినుండి క్యాంపు ఆఫీసుకి, అక్కడి నుండి సచివాలయానికి మధ్య తిరిగేటప్పుడు దారిలో బోలెడంత ట్రాపిక్ జామ్ అవుతుంది. ఈ అసౌకర్యాన్ని రోతలేకుండా భారించాల్సింది భాగ్యనగర ప్రజలే. ఈ ట్రాఫిక్ ని కంట్రోలు చేయడానికి ప్రతిరోజూ పోలీసులు అవస్థ పడాలి. ఇటు ఇంటికి, అటు క్యాంపు ఆఫీసుకి సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం అదనపు బలగాలు కావాలి. ముఖ్యమంత్రి అంటే ఇరవై నాలుగ్గంటల ఉద్యోగం కాబట్టి వీడియో కాన్ఫరెన్సింగ్, కమ్యూనికేషన్ వసతులు ఆఫీసులో సరేసరి, ఇంటిలో కూడా కల్పించాల్సి ఉంటుంది. వీటి కోసం అదనపు ఖర్చు.
ఇవన్నీ ఒక ఎత్తయితే ముఖ్యమంత్రి మూఢ విశ్వాసాల కొరకై అరవై లక్షలు తగలేసి వాస్తు పేరిట రిపేర్లు చేయించడం ఇంకో ఎత్తు. పైగా ఈ భవనం కట్టి నాలుగేళ్ళు కూడా పూర్తి కాలేదు.
అసలు వాస్తు విషయంలో మన ప్రభుత్వ పాలసీ ఏమిటో ఎవరికీ అర్థం కాదు.
ప్రభుత్వం నిర్మించే/వినియోగించే భవన, గృహల విషయంలో వాస్తు నియమాలు పాటిస్తుందా, పాటించదా?
ఒక వేళ పాటిస్తే, ఇప్పుడు ఈ మార్పులు ఎందుకు అవసర మయ్యాయి?
కాల క్రమేణా వాస్తులో కూడా మార్పులు వస్తుంటాయా?
మనుషులను బట్టి, పదవులను బట్టి వాస్తు మారుతుందా?
ప్రభుత్వానికి అధికార వాస్తు పండితుడు అంటూ ఎవరైనా ఉన్నారా?
ఉంటె అతను దేన్నిప్రామాణికంగా వాస్తు చెబుతాడు? భవిషత్ లో వచ్చే వాస్తు అనర్ధాలకు అతను భాద్యతతీసుకుంటాడా?
ఇవి రోడ్లు,భవనాల శాఖ నియమావళికి అంటే సివిల్ ఇంజనీరింగ్ సూత్రాలకు అనుగుణంగా ఉందా?
ఒక వేళ ప్రభుత్వం వాస్తు పాటించదు అంటే , మరి ఏ నిబంధనల ప్రకారం ఈ వాస్తు మరమ్మతులు చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే నాధుడు ఎవ్వడు?
ఆచార్య కొడాలి శ్రీనివాస్
Comments