Skip to main content

చైనా వాస్తు -ఫెంగ్ షుయి

నీవు నైరాశ్యం లో జీవిస్తున్నావు అంటే భూతకాలంలో, ఆందోళనలో గడుపుతూ ఉంటే భవిషత్ కాలంలో, ప్రశాంతంగా జీవిస్తున్నావు అంటే వర్తమానంలో బ్రతుకుతున్నావని తెలుసుకొ ... అని చైనా తత్వవేత్త తావో ఉపదేశం. 
ఈ తత్వం తలకెక్కక తల్లడిల్లే వారెందరో. కష్టనష్టాల ఊబిలో ఊపిరి సలపనివారు, ఆశా భయాల ఊయలలో ఉగిసలాడేవారు వివేకం కోల్పోయి దప్పికతో ఉన్న దుప్పుల్లా ఎండమావుల వెంట పరుగులు పెడుతుంటారు. 
సర్వ సంపదలకు, కర్మ ఫలాలకు మన దేశవాళి వాస్తు దారి చూపిస్తుందనే వాస్తు విధ్వంసుల విన్యాసాలతో జరిగిన గృహాల విధ్వంసంతో కుదేలైన జనం తాజాగా చైనా బాటపట్టారు. 
కొత్త ఒక వింత - పాత ఒక రోత అన్నట్లు మన పాత వాస్తును వదిలి చైనా వారి సాంప్రదాయక వాస్తు మర్మ కళ 'ఫెంగ్ షుయి' వెంట పరుగులు పెడుతున్నారు. చైనా భాషలో ఫెంగ్ -అంటే గాలి, షుయి - అంటే నీరు అని అర్థం. ఫెంగ్ షుయ్ అనే ఈ మార్మిక కళను జియోమెన్సీ అనికూడా పిలుస్తారు. జియోమెన్సీ అంటే భూమిపై ఉండే దైవిక చిత్రాలు. చైనా,థాయిలాండ్ దేశాలలో శుభాశుభాల పోకడలను సూచించే ఒక తాంత్రిక విద్యగా ప్రాచీన కాలం నుండి కొనసాగుతూ వస్తుంది.  
తైజీతు యంగ్-యాన్ చిహ్నం 
మనిషి మనుగడకు గాలి, నీరుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి వాటిని నివాసానికి  ఎలా వర్తింపజేయాలనే సూత్రాన్ని ఆధారం చేసుకొని, యాంగ్-యాన్ అనే తాత్విక సృష్టి సిద్ధాంతాన్ని మేళవించి  ఆధునీకరించి రూపొందించినదే ఈ చైనా దేశవాళీ వాస్తు. 
అన్ని ప్రాచీన సమాజాలలో ప్రకృతిని అర్ధం చేసుకునే తీరులో అనేక ఊహాకల్పనలు ఉద్బవించాయి. అలాంటి వాటిలో ప్రాచీన చైనావాసుల ఊహా కల్పనలకు ఒక చక్కని రూపమే ఈ వాస్తు మర్మకళ. 
ఈనాడు ఇది రకరకాల పోకడలతో క్రొత్త పుంతలు త్రొక్కుతూ ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తూ ఒక గాలి ధుమారం వలె మన దేశంలోకి దిగుమతి అయింది.
వాస్తు దోషాలకు రకరకాల వాస్తు పూజలు, శాంతులు, వాస్తు తాయెత్తులు(మత్స్యయంత్రాలు,కుబేర,లక్ష్మీ...యంత్రాలు), నరదృష్టికి  దిష్టి పిడతలు/బొమ్మలు, గుమ్మడికాయలు, భూత, ప్రేత భయాలకు  నిమ్మకాయలు, చెప్పులు, వెంట్రుకలు, మిరపకాయలు వంటి వాటిని ఇంట్లో ఉంచుకొనే మన ప్రాచీన దేశీవాళి చిట్కా పద్దతుల స్థానే ఇప్పుడు ఆకర్షణీయమైన చైనా దేశపు చిట్కాలు, చిత్రాలు, చిందులు ఫెంగ్ - షుయి పేరుతో మార్కెట్టులోకి వెల్లువలా వచ్చాయి.
నవ్వే బుద్దుడి బొమ్మ ఉంటే ... సిరులు ఇంటిలోకి నవ్వుతూ నడచి వస్తాయట!
మూడు కాళ్ళ కప్ప బొమ్మ గుమ్మంలో కాచుకు కూర్చుంటే లక్ష్మీ మేలు జరుగుతుందట, ఇంకా చైనా పాము (డ్రాగెన్), తెల్ల పులి, నల్ల తాబేలు, రంగు రంగుల చేపలు, వెదురు చెట్లు, గాలి గంటలు... వంటి చిత్రవిచిత్ర బొమ్మలు, వస్తువులు ఇంటిలో ఉత్తినే ఉంచుకుంటే/ అమర్చుకుంటే శుభమట. 
గాలి గంటలు (విండ్ చిమ్), వెదురు పుల్లలు, కుత్రిమ నీటి కొలనులు, రాగి నాణేలు, రంగు దీపాలు, ఎర్ర రిబ్బన్లు ...అబ్బో బోలెడన్నితమాషా వస్తువులు. 
గృహస్థుల రకరకాల సమస్యలకు వాస్తు మరమ్మతుల పేరుతో ఇంటిని కూలగొట్టే పనిలేకుండా కేవలం చైనా వారి గృహాలంకరణ వస్తువులతో ఇంటిని నింపుకుంటే గృహ దోషాలు తొలగిపోయి అంతా మంచే జరుగుతుందట!! 
వద్దంటే డబ్బుఆట !!! 
ఎంత ఆశ ?
ఫెంగ్ షుయి పేరుతో జరుగుతున్న ఈ అసత్య ప్రచారంతో ఈనాడు చీనా వారి వాస్తు వస్తువులు మార్కెట్టులో వేలంవెర్రిగా అమ్ముడు పోతున్నాయి. వందల నుండి వేల రూపాయలలో ఖరీదు చేసే ఈ వస్తువులు జనాల జేబులు ఖాళీచేస్తున్నాయి.
ఇప్పటికే మన వాస్తు పండితుల పిచ్చి చేష్టలతో ఇల్లు వళ్ళు గుల్ల చేసుకొని , ఇంకా ఆశ చావక ఈ చీనా వాస్తును పట్టుకొని ఇంటికి సొగసులు అద్దుతూ, మరమ్మత్తులు చేస్తూ, ప్రాకులాడే వారిని చూసి నవ్వాలో, జాలిపడాలో ... అర్ధం కాకుండా ఉంది.
ఫెంగ్ షుయి పేరుతొ జరిగే మోసాలు, దోపిడిలు గమనించిన చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం తమ దేశంలో దీనిపై నిషేధం విధించినదన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. చట్ట విరుద్దంగా ఎవరైనా ఫెంగ్ షుయి ని చూపి ప్రలోభపెట్టి ప్రజల నుండి డబ్బు గుంజితే వారికి ఆ దేశంలో చేరసాలే గతి. 
ఈ నిషేధం తో ఫెంగ్ షుయి సిద్దాంతులు జీవనోపాది కోల్పోయి చైనాను వదిలి ఇతర బౌద్ధ దేశాలలో కాలం గడుపుతూ ఈ నమ్మకాలను ప్రపంచవ్యాప్తంగా వెదజల్లుచున్నారు.
ఏ దేశం లోనైనా వాళ్ళ సమాజం లో ఏదో ఒక రూపం లో కొన్ని మూడ నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మన విజ్ఞానం వికసించే కొద్ది వాటిలో కొన్ని కనుమరుగు అవుతాయి . అనాదిగా మన సమాజంలో ఇప్పటకే అనేక మూఢ విశ్వాసాలు పాతుకుపోయి ఉన్నాయి. వాటితోనే మన సమాజం సతమతం అవుతుంటే ఇంకా క్రొత్తగా కొన్నిపిచ్చి నమ్మకాలు ఇతర దేశాలనుండి దిగుమతి చేసుకోవటం అభిలషియం కాదు.
చైనా చిట్కాలకు చింతకాయలు రాలవు. చిత్ర చిత్ర చిట్కాలతో గారడి చేస్తే కష్టాలు, నష్టాలు తీరవన్నసంగతి ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.
ఆచార్య కొడాలి శ్రీనివాస్ 

Comments

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర 

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు ది