
1.అమరావతికి అంకురార్పణ
ఏ రాజ్యానికైనా ఒక రాజు ఆయన నివాసానికి, రాజ్య పాలనకు ఒక రాజధాని ఉండటం ఒక విధానం. రాజులు రాజ్యాలు పోయినా దేశాలకు, రాష్ట్రాలకు పరిపాలనా కేంద్రాలగా నేడు రాజధానులు పనిచేస్తున్నాయి. రాజ్య నిర్మాణంలో రాజధాని ఆవశ్యకత ఎంతో ఉంది. చరిత్రలో ఎంతో మంది రాజులు రాజధానులు నిర్మించిన వైనం మనకు విదితమే. అలాంటి చరిత్రాత్మకమైన మరొక సంఘటన నేడు ఆంధ్రుల ముంగిట నిలుచుంది.
రాజధాని లేని నవ్యాంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని నిర్మించుకోవాలిసిన ఆవశ్యకతో గత ప్రభుత్వం అందరి ఆమోదంతో అసంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి అమరావతికి అంకురార్పణ చేయటం అందరికి విదితమే. దానికి రైతులనుండి భూసమీకరణ పద్దతిలో 34 వేల ఎకరాల భూమిని సమకూర్చుకోవటం , ఇప్పటివరకు 8 వేల కోట్ల ప్రజా ధన్నాన్ని వెచ్చించి కొంతవరకు నిర్మాణాలను చేయటం జరిగింది. అయితే గత ఎన్నికలలో ప్రభుత్వం మారటంతో " రెడ్డి వచ్చే ... మొదలిడు" అన్న చందాన రాజధాని విషయం మళ్ళీ మొదలకు వచ్చింది. ఇలాంటి సంకట స్థితిలో ప్రజలు విజ్ఞత చూపించాలి. రాజకీయాన్ని పక్కన పెట్టాలి. ఐక్యతను చాటాలి. అమరావతి నిర్మించాల్సిన ఆవశ్యకత ఏమిటో తెలుసుకోవాలి.
రాజధాని రూపురేఖలు గురించి మాట్లాడేఅర్హత ఉన్నా లేకున్నా ప్రతి వారు,ముఖ్యంగా నగర రూపురేఖలు (TOWN PLANING) గురించి కనీస పరిజ్ఞానం లేకుండా తమకు తట్టిన ఆలోచనలు చెప్పుతూ - ప్రజలను తప్పు దారి పట్టిస్తూ స్వార్ద రాజకీయం చేస్తున్నారు. ఈనాడు రాజధాని రాజకీయం పై అందరకి ఒక అవగాహనకు రావటానికి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.
అమరావతి అంటే అజరామరమైన నగరం. మన పురాణేతిహాసాల్లో దేవేంద్రుని రాజధానిగా అభివర్ణింపబడిన నగరం. క్రీస్తు పూర్వమే భరతఖండంలో సువిశాల సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన నగరం. శ్రీముఖ శాతకర్ణి నుంచి యజ్ఞశ్రీ శాతకర్ణి వరకు 4 శతాబ్దాలు అప్రతిహతంగా గాంధారం నుంచి కృష్ణాతీరం వరకు విస్తరించిన సామ్రాజ్యానికి రాజధాని నగరం. గౌతమ బుద్ధుని పాదస్పర్శతో పునీతమైన నగరం. ఆచార్య నాగార్జునుని వంటి అనేకమంది పండితుల తాత్విక శాస్త్ర చర్చోపచర్చలతో మార్మోగిన నగరం. సనాతన, బౌద్ధ ధర్మాలు రెండింటికీ సమానంగా ఆలవాలమై విలసిల్లిన నగరం. మన ప్రజల గత వైభవాన్ని చాటి చెప్పే అమరావతి నామాన్ని మన నూతన రాజధానికి పెట్టుకుని చరిత్ర నుంచి స్ఫూర్తి పొందుతూ అత్యంత అధునాతన ప్రజా రాజధాని నగరంగా తీర్చిదిద్దుకోవాలని సగటు ఆంధ్రుని ఆకాంక్ష. డొక్క శుద్ధిలేనివారు 'హైమావతో కైమావతో' అని గేలిచేసి గోలచేస్తే చరిత్ర చెరిగిపోతుందా?

1.2 ఘనచరిత్ర
ఎప్పుడో 2000 ఏళ్ల క్రితమే ఆంధ్రుల రాజధానిగా విలసిల్లిన ధాన్యకటకం (ధరణికోట) ఆ తరువాత అమరావతిగా ప్రపంచ ప్రసిద్ది చెందినది. ఈ పట్టణం పేరు తిరిగి స్పురించేలా నేడు మరల నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి అవతరించటం శుభపరిణామం. తాత పేరు మనుమడికి పెట్టె సాంప్రదాయం మన తెలుగునాట సర్వ సాదారణ విషయమే. తాత పేరు, కీర్తి నిలబెట్టాలనే లక్ష్యంతో ఈ వరవడి కొనసాగుతుంది. కొత్త అమరావతి గత కీర్తులను అధికమించాలనే అందరి ఆకాంక్ష.
బౌద్ధం,జైనం , శైవం వంటి భిన్న మతాల, సంస్కృతులకు కాణాచిగా పేరొందిన అమరావతి కృష్ణా నదీ తీర ప్రాంతంలో నేడు నూతనంగా నిర్మించబోయే తుళ్ళూరుకు అతి సమీపాన ఉంది.
మౌర్య చక్రవర్తుల కాలంలో ఇక్కడ బౌద్ధస్థూపాన్ని నిర్మించారు. ఇది దేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం. విశ్వ కీర్తి గడించిన ఈ బౌద్ద ఆరామాల వల్ల ఇది అమరావతిగా పిలవబడింది. అమరావతిలో ఆనాడు ఒక చర్మకారుడు ఆరామానికి విరాళంగా ఇచ్చిన పూర్ణ కుంభమే నేటి మన ఆంధ్రప్రదేశ్ అధికార ముద్రలో ఉన్నదన్న సంగతి గమనార్హం.
నేడు అమరావతి అమరేశ్వరునిగా కొలువందుకుంటున్న స్వామి ఆనాడు ధరణికోట అమరేశ్వరస్వామిగా వెలుగొందుతున్నాడని ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. ఇది పంచారామాలలో ఒకటిగా పుణ్య క్షేత్రంగా వాసికెక్కినది. పురాణాలలో దేవతలకు రాజధాని అమరావతి అని వర్ణించబడినది.
శాతవాహునల నుండి వాసిరెడ్డి రాజా వరకు ఎందరో పాలకులకు రాజధానిగా , ఆచార్య నాగార్జునుడు నుండి శాంతి దూత దలైలామా వరకు ఎందరికో ఆద్యాత్మక కేంద్రంగా విలసిల్లిన నేల ఇది. మొదటి కాల చక్రకు ఆతిధ్యం ఇచ్చిన ప్రదేశం . గౌతమ బుద్దుడు నడయాడిన కర్మ భూమి ఇది. ఇక్కడ అవిర్బవించిన అమరావతి శిల్పం అద్బుతం.
ఇప్పుడు కట్టబోతున్న అమరావతి ప్రాంతంలో గల గ్రామాలు కూడా ఒకనాడు చరిత్ర ప్రసిద్ధిపొందిన ప్రాంతాలే. 1199 AD నుండి 1261AD వరకు ఈ ప్రాంతాన్ని కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు పరిపాలించారు. ఆకాలంలో శైవ మతం ఉచ్చస్థితి లో ఉంది. శైవులు దేశం నలుమూలల అనేక మఠాలు నెలకొల్పి ప్రజాసేవ చేసారు. ఈ శైవ మఠాలలో దాహళ దేశం నుండి వచ్చిన గోళకీ మఠము సుప్రసిద్దమైనది.

కాకతీయుల మల్కాపురం శాసనం
ఈ మఠానికి నేటి అమరావతిలో భాగమైన 'మందడం గ్రామం' ప్రధాన కేంద్రం. ఈ మఠానికి అనుభంధంగా వేద పాఠశాలు, సత్రాలు, దేవాలయాలతో పాటు ప్రసూతి ఆరోగ్య శాలలు ఉండేవి. ఈ గోళకీ మఠము యొక్క మఠాధిపతి విశ్వేశర శివదేశికులు. వీరు కాకతీయ చక్రవర్తి గణపతి దేవునికి శివదీక్షను ఇచ్చారు. ఆనాడు ఈ గోళకీ మఠము నిర్వహణ నిమిత్తం వెలగపూడి, మందడం గ్రామాలను మందడంలో ఉన్న ఆధ్యాత్మిక గురువు శివాచర్యకు బహుమతిగా ఇచ్చారు. ఇక్కడికి సమీపంలో మల్కపురం గ్రామంలో శివాలయ ఆవరణలో కాకతీయ చక్రవర్తి వేయించిన శిలా శాసనం ఉంది. దీన్నిచరిత్రకారులు 'మల్కాపురం శాసనం' గా వ్యవరిస్తారు. ఈ శాసనం 2.9x2.9 అడుగుల చతురస్రాకారపు ఒక నల్ల రాతి శిలా స్థంభం. దీని ఎత్తు 14.6 అడుగులు. తెలుగు సంస్కృత భాషలలో 182 పంక్తులలో రాణి రుద్రమదేవి జన్మించిన శుభ సందర్బంగా విశ్వేశర గోళకీ మఠముకు గణపతి దేవుడు ఇచ్చిన భూదానం గురించి చెక్కబడినది.
గతాన్ని గుర్తు చేసే ఈ అమరావతి ఘన చరిత్ర మన వర్తమానానికి బాటలు వేస్తుంది. దశ, దిశ నిర్దేశిస్తుంది.
నవ్యాంధ్ర రాజధానిగా పునురుత్తేజం పొందుతున్న అమరావతి నగరం ఆధునిక ఆంధ్రుల నాగరిక వికాసానికి , వైభవానికి , పౌరషానికి సజీవ సాక్ష్యంగా, ఆంధ్రుల ఘనచరిత్రను, విజయగాథను, శాస్త్ర, సాంకేతికరంగాల్లో సాధించిన కీర్తిని, తాత్విక చింతనలో కనబరచిన గాఢతను ప్రతిబింబింపచేలా కలకాలం వర్దిల్లాలని ఆశిద్దాం. (సశేషం)
- Prof.Kodali Srinivas
Comments