Skip to main content

వాస్తు భూతం మళ్లీ పుట్టింది

బంగారు తెలంగాణలో భాగ్య నగరం నడిబొడ్డున ఓ గాడిద గుడ్డేట్టింది. ఆదివారం అమావాస్య అర్దరాత్రి సమయంలో ఆ గార్దాభాండం బద్దలై దాని నుండి వికృతాకారం తో పెడబొబ్బలు పెడుతూ భూ ఆకాశాలను తాకుతూ ఓ మహాభూతం ఉద్బవించింది. రాబోయే కీడును సూచిస్తూ గుంట నక్కలు, గుడ్లగూబలు నిశరాత్రిలో భయంకరంగా అరిచాయి. పాల పిట్టలు పరుగులు తీస్తే, ఊరకుక్కలు ఏడుపు లంకించుకున్నాయి. అకాలంగా ఆకాశంలో మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో గులాభిరంగు వాన కుండపోతగా మూడు దినాలు కురిసింది. నాలాలు ఉప్పొంగి ఊరు వాడ ఏకమై సముద్రాన్ని తలపించింది. 
ఈ అపశకునాలు గుచ్చి గుచ్చి చూసి పిచ్చి పండితులు బంగారు భూమికి భూత కీడు దాపురించినదని, ఆనాటి వాస్తు భూతం మళ్లీ పుట్టింది అని సెలవిచ్చిచారు. 
ఈ భూత ఉత్పాతం వల్ల రాబోయే రోజులలో బంగారు భూమికి ఎంత కీడు చేస్తుందోనని తెరాసురల అధిష్టాన, ఆస్థాన దేవతలు, పొద్దుకూకులు తెలంగాణ జపం చేసే ఉస్మానీశ్వరులు, ఆచార్యులు, గులాభి జండాలో ఎర్ర రంగును చూసే శుక్ల దృష్టి గల క్రామేధావులు, పోరాడితే ప్రాణం తప్ప పోయేదేమనే పోరగాళ్ళు, లావక్కంత లేని న్యాయవాదులు, స్వరనినాదవాగేకారులు, అస్తమానం లొల్లి పెట్టె శ్రామిక, కర్షక, కార్మిక, కులసంఘ నాయకులు, లంచాలతో బ్రతికే ఉద్యోగ జీవులు ... ఒక్కరేమిటి గొడ్డు గోదా, పిల్లాపిచు అందరు ఆ మహా భూతాన్ని చూసి భీతి చెందారు. వాంతులు విరోచనాలు జ్వరాలు వచ్చి మంచాలలో పడ్డారు . 

ఇలా ప్రాణ భీతితో సర్వజన గణాలన్నీ పరుగు పరుగున తెరాసురుల దొరగారి చెంత చేరి ఈ ఆపద నుండి తమను, తోటి వీరులను, అల్పజనులను, వంశాకులను కాపాడమని పరిపరి విధాలుగా శోత్రాలతో, వంతావార్పులతో లొల్లి చేయగా సంతృప్తి చెందిన దొరస్వామి గారు మగత దిగిన తక్షణమే తన మంత్రి పుంగవులను, రాజ పురోహితులను, సుద్దులు చెప్పే సిద్దాన్తులను సమావేశపరిచి తరుణోపాయం సూచించమనగా వారు ముక్తసరిగా యిట్లనిరి. 
" ఓ దొరా నీ బాంచన్, నీ కాల్ మొక్కుతాం! ఈ భూతం పూర్వం అంధకాసుర యుద్దంలో శివుని స్వేద బిందువు నుండి ఉద్బవించినది. దానిని చూసి ఇప్పటివలే ఆనాడు దేవతలు భయకంపితులైనారు. పరబ్రహ్మ ఆదేశంతో ఆభూతాన్ని భూమిపై బోర్ల పడవేసి అది తిరిగి లేవకుండా ఆదిసీమ దేవతలు దానివీపు పై సుఖాసినులై తెలుగు ప్రజల నుండి తొలి పూజలు అందుకున్నారు. 
లోకంలో విజ్ఞులు దీనిని వాస్తు భూతంగా పిలిచేవారు. 
కాలగతిలో కాంగీయుల ప్రభావంతో ఆది దేవతల మహిమలు క్షీణించి మీ రాక్షస మాయ వల్ల శక్తి హీనులై వారి నిజరూపం నిరూపమై మనకు దయ్యాలై కన్పించారు. మీ బుడ్డి కుశలంతో వాటికి బడిత పూజ చేసి బయటకు గెంటివేశారు. శరభ .. అశరభ అంటూ మీరు తెచ్చిన కొత్త దేవతలను బొంనాళ్ళ పండుగకు తెరాసురుల నెత్తిన పెట్టుకున్నాం. దీనికి వగచిన ఆదిసీమ దేవతలు అలిగి అమాంతం భూతము పై నుండి లేచి కృష్ణా తీరంకు వలస వెళ్ళిపోయారు. దానితో అప్పటి వరకు సచివాలయం కింద అణచబడి ఘాఢనిద్రలో ఉన్నవాస్తు భూతం తిరిగి లేచింది. పగతో,కసితో కాష్మోరా లా అది మనలను మింగాలని నాలుక చాచుకు కూర్చుంది. దీని వెనుక విపక్షాలతో పాటు దేవ గురువు బృహస్పతి శిష్యుడు శశాంకుని పాత్ర ఉన్నదని మన తెలంగాణా కర్ణ పిశాచులు వార్తలు చెబుతున్నాయి. 
మూడున్నర కోట్ల మందు బిడ్డా, బొబ్బిలి వీరా, పులి రాజా ఓ విపరీత మేధావి ... ఎన్నో వేల పుక్కిటి పురాణాలు అవపోసన పట్టిన మీకు ఈ వాస్తు వింతలు, విడ్డూరాలు, కథలు, కాకరకాయలు ఏవి తెలినవి కావు. కాబట్టి ఈ మహా భూతం గురించి బాగుగా ఆలోచించి, లోతుగా తొంగిచూచి తక్షణమే తగు లోపాయకారి తరుణపాయం సూచించగలరు" అని కాళ్ళా వెళ్ళా బోర్లా పడి ప్రార్దించగా, శాంతించిన శ్రీమాస్ దొరవారు బద్దకంగా బండముక్కు రుద్దుకొని ప్రసన్న వదనుడై తన మనస్సులో మెరుపులా ఉద్బవించిన దురాలోచనను చిలక నవ్వుతో సావదానంగా చెప్పాడు. 
దొరవారి ఆదేశంతో ఆస్థాన వాస్తు కుక్షింబరులు రుద్దిన ఈ వాస్తు తీర్మానాన్ని యువరాజు ప్రతిపాదించగా దానికి యువ రాణి, దళపతి వంటి తెరాసురుల తాబెదారులందరు డోలు డప్పులతో చిందులు వేస్తూ జజ్జనక 'జై వాస్తు బోలో తెలంగాణా' అంటూ చిందులు వేస్తూ సంతోషంగా ఈలవేసి గోల చేసి చప్పట్లు తప్పట్లతో తమ సమ్మతి తెలియజేసారు. 
ఈ గలీజు వాస్తు తీర్మానం అయిన వెంటనే వాస్తు భూతాన్ని కట్టడి చేసి ప్రసన్నం చేసుకొనేలా ప్రజాధనంతో ఓ కొత్త సచివాలయం ఎర్రగడ్డలో పిచ్చి ఆసుపత్రిని కూల్చి కట్టాలని, కొత్తగా కట్టే పిచ్చి దవాఖానాను కేవలం వాస్తు పిచ్చి పట్టిన వాళ్లకు మాత్రమే కేటాయించాలని, రాష్ట్రంలో వాస్తు దోషం ఉన్న అన్ని భవనాలను అయినకాడికి అమ్ముకోవాలని, ఈ భూతర్పణ వాస్తు పూజలో సర్వ తెరాసుర దేవతలకు, బంధుగణాలకు, మిత్ర గుత్తేదారులకు ధారాళంగా 'బలి' సమర్పించాలని, ఇంకా సర్కారు సొమ్ముతో దేశంలో ఉన్న అన్నిముఖ్య పుణ్యక్షేత్రాలలో మొక్కులు తీర్చుకోవాలని, గుడుల్లో శాంతి పూజలు చేస్తూ వాలు వీలును బట్టి ప్రజలందరూ నజరానాలు, పొర్లు దండాలు, తిరుక్షవరాలు చేసుకోవాలని ప్రభుత్వ అధికార ప్రకటన జారి అయింది. అంతట ఆందోళన తగ్గి స్థిమిత పడిన తెరాసుర గణాలు తమతమ నెలవలకు వెళ్లాగా యధావిధిగా దొరవారు సురాసేవనకు ఉపక్రమించారు. 
సర్వ అమంగళం అశుభమ్ భూయాత్! 
ఇది తెగులురాజ్య పురాణంలో వాస్తు భూత పునః జననం అనే నూతన ప్రకరణం సంపూర్ణం . 
@@@@@@

Comments

Popular posts from this blog

అమరావతి - ఆవశ్యకత - 8

మోసం అనేది చాలీచాలని దుప్పటి వంటిది. తల కప్పుకుందామంటే కాళ్ళు, కాళ్ళు కప్పుకుందామంటే తల కనపడుతుంది. అమాయక రైతులను మోసం చేయటానికి, ఆలోచనాపరుల నుండి మద్దతు రాకుండా చేయటానికి అమరావతి పై సాంకేతిక విషయాలలో అయోమయాన్ని సృష్టించారు. 1. అమరావతిలో నేలలకు పటుత్వం తక్కువ అని, భారీ భవన నిర్మాణాలకు పనికి రాదని అంటూనే పునాదులకు ఖర్చు ఎక్కువ అని దుష్ప్రచారం చేశారు. సహజంగా నల్లరేగడి భూములకు పటుత్వం తక్కువగానే ఉంటుంది. సాధారణంగా ఇది ఒక చ.మీ కు 15 టన్నుల బేరింగ్ కెపాసిటి ఉంటుంది. ఎక్కడైనా అధిక అంతస్థుల భవన నిర్మాణంలలో పునాదులు లోతులోనే ఉంటాయి. అయితే అమరావతిలో భూమిలోపల ఆరు మీటర్ల లో దృఢమైన రాతి పలక ఉండటం చేత అది నిర్మాణాలకు అత్యంత అనుకూలంగా ఉందనేది వాస్తవం. పటుత్వం ఎక్కువ ఉన్న రాతినేలలు, గులక నేలలు ఉన్న చోట్ల పునాదులకు బ్లాస్టింగ్ ఖర్చు, రవాణా ఖర్చు ఎక్కువ. వీటితో పోల్చి చూస్తే అమరావతిలో పునాదులు అయ్యే వ్యయం ఒక చదరపు అడుగుకు షుమారుగా 200 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవదు. అమరావతికి ఉన్న ఇతర ప్రయోజనాలతో పోలిస్తే ఇది చాలా స్వల్ప మైనది. పునాదులకు ఎక్కువ ఖర్చు అనుకుంటే సాధారణ గృహాలను, 5 లేక 6 అంతస్థుల భవనాల...

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం...